Shivamogga, April 3: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును (Dog found carrying body of newborn ) నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. శివమొగ్గ జిల్లాలోలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళకు శిశువు జన్మించింది.
అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ వీధి కుక్క.. ప్రసూతి వార్డులోకి ప్రవేశించి అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది.. వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి.. కుక్క బయటకు పరుగులు పెట్టింది. తరువాత అక్కడే వదిలేసిన శిశువును సిబ్బంది ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శిశువును పరిశీలించిన వైద్యులు.. బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు.
అయితే, కుక్క కాటుకు ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా అంతకుముందే చనిపోయాడా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, శిశువు మృతిలో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా కొద్ది నెలల క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే.