Mumbai, March 31: దేశ వాణిజ్య రాజధాని (Financial Capital) ముంబయి (Mumbai)కి భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా పేరుంది. ఇక్కడ సాధారణ అపార్ట్‌మెంట్ (Apartment)లో ఒక ఫ్లాట్ ధర రూ.కోటి పైనే ఉంటుంది. మరి అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయాలంటే పదులు, వందల కోట్లు కుమ్మరించాల్సిందే. తాజాగా, ఈ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడంతస్తుల ఫ్లాట్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఆ ట్రిప్లెక్స్ (Triplex Flat) ఇంటి ధర అక్షరాలా రూ.369కోట్లు. మరి అంత ఖరీదైన ఇంటిని ఎవరు కొన్నారో తెలుసా? ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు.. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ (Malabar Hills) ప్రాంతంలో రూ.369కోట్లతో ఓ లగ్జరీ ట్రిప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా ఉన్న ఈ ఇంటిని లోధా గ్రూప్‌నకు (Lodha Group) చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి కొన్నారు. ఇప్పటివరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఇదేనని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
సూపర్ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్ ప్యాలెసెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఉంది. దీని వైశాల్యం 27,160 చదరపు అడుగులు. అంటే ఒక్కో చదరపు అడుగును రూ.1.36 లక్షలకు జేపీ తపారియా కుటుంబం కొనుగోలు చేసింది. చదరపు అడుగుల ఆధారంగా.. ఇదే అత్యంత విలువైన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ డీల్ అని సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఫ్లాట్‌కు తపారియా కుటుంబం స్టాంప్ డ్యూటీ కిందనే రూ.19.07కోట్లు చెల్లించినట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం ఇదే లోధా గ్రూప్ నుంచి బజాజ్ ఆటో (Bajaj Auto) ఛైర్మన్ నీరజ్ బజాజ్ కూడా అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేశారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడంతస్తుల ఫ్లాట్‌ను ఆయన రూ.252.5 కోట్లకు తీసుకున్నారు. ముంబయి నగరంలో ఖరీదైన ప్రాంతం, బీచ్ వ్యూ వంటి కారణాలతో ఇక్కడ అపార్ట్‌మెంట్‌లు ఇంత ఖరీదు పలుకుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, గత నెలలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అపార్ట్‌మెంట్‌లో డీమార్ట్ (Dmart) అధిపతి రాధాకిషన్ దమానీ (Radhakishan Damani) కుటుంబం రూ. 1,238 కోట్లతో 28 ఫ్లాట్లను కొనుగోలు చేసింది.