Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, November 8: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో (Lakhimpur Kheri Violence) రైతులపై కారుతో దూసుకుపోయి, పలువురి మృతికి కారణమైన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ కొనసాగుతున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా (Supreme Court Expresses Dissatisfaction With Investigation) లేదని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు సాక్షుల్ని విచారించాం అనే మాట తప్ప నివేదికలో అంతకుమించిన వివరాలు లేవని, కేసు పురోగతి ఏ విధంగా ఉందో ఈ నివేదిక చెప్పకనే చెబుతోందని విమర్శించింది. ఈ కేసు ద‌ర్యాప్తు న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని గ‌తంలోనూ సుప్రీంకోర్టు యూపీ ప్ర‌భుత్వానికి అక్షింత‌లు వేసింది.

హింసాకాండకు సంబంధించి 13 అరెస్టు చేయగా.. ఆశిష్‌ మిశ్రా ఫోన్‌ను జప్తు చేయడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితుల ఫోన్‌ కాల్‌ వివరాలు ఇవ్వాలని, పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసులు సేకరించిన ఇతర ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసుకు ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. కాగా, కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం నేటి విచారణలో నిరాకరించింది. ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసును ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

రైతులపై కారు నడిపి చంపిన కేసు, పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అశిష్‌ మిశ్రా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేమ‌ని తెలిపిన యూపీ సీఎం యోగీ

యూపీ నియమించిన న్యాయ కమిషన్ పై నమ్మకంలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. రెండు ఎఫ్ఐఆర్ లను కలిపి విచారించడం చూస్తుంటే నిందితుడికి ఊరట కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల జడ్జిల పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని (Mulls Appointing Retired HC Judge to Monitor Probe) అభిప్రాయపడింది. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ ల పేర్లను సిఫారసు చేసింది. ఈ ఇద్దరు జడ్జిల్లో ఒకరి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. శుక్రవారంలోగా అభిప్రాయం చెప్పాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సాక్షుల‌కు భ‌ద్ర‌త కల్పించండి, ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌ విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

కాగా ల‌ఖింపూర్ ఖేరిలో ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పైకి కేంద్ర మంత్రి కుమారుడికి చెందిన‌దిగా భావిస్తున్న‌ ఎస్‌యూవీ దూసుకెళ్ల‌డంతో న‌లుగురు రైతులు మ‌ర‌ణించ‌గా, ఆపై జ‌రిగిన అల్ల‌ర్ల‌లో మ‌రో న‌లుగురు మ‌ర‌ణించ‌డం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.