Patna, April 17: దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు బెయిల్ (Lalu Prasad Yadav Gets Bail) లభించింది. దుంకా ట్రెజరీ కేసులో రాంచీ హైకోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా లాలూ దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అంతేగాక బెయిల్ సమయంలో చిరునామా, ఫోన్ నంబర్ లాంటివి మార్చకూడదని స్పష్టం చేసింది.
కాగా దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం నాలుగు కేసుల్లో (Fodder Scam Case) లాలూ నిందితుడిగా ఉన్నారు. 1990ల్లో దుంకా ట్రెజరీ నుంచి లాలూ (Former Bihar Chief Minister,) అక్రమంగా రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారంటూ నమోదైన కేసులో... సీబీఐ కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.
గతంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్‌లో ఉండేది. ఆ సమయంలో సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అక్రమ రీతిలో ప్రభుత్వ ఖజానా నుంచి 3.13 కోట్లు కాజేశారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
దాణా కుంభకోణంలో భాగమైన నాలుగు కేసుల్లో.. మూడింటిలో ఆయనకు బెయిల్ గతంలోనే మంజూరీ అయ్యింది. ఇక దమ్‌కా కేసులో బెయిల్ దక్కిన లాలూ.. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పూర్తి అయితే.. ఆయన తన స్వంత రాష్ట్రానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.