Jaipur, NOV 15: రైల్వే కార్యకలాపాలకు ముప్పు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే బోర్డు (Indian Railways) సిద్ధమైంది. రైల్వే ప్రాంగణాలు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది. రైల్వే ట్రాక్‌లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న (Reels) ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘‘కొందరు ఆకతాయిలు అన్ని హద్దులు దాటారు. రైల్వే ట్రాకులపై వస్తువులు పెట్టడం, వాటిపై వాహనాలు నడపడం, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరంగా స్టంట్లు చేయడం వంటి చర్యలతో వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా వందల మంది రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు’’ అని ఓ సీనియర్ రైల్వే అధికారి పేర్కొన్నారు. రైళ్లకు దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు అతిక్రమిస్తూ రీల్స్ (Social Media Reels)చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు సమాచారం.
జైపుర్ డివిజన్‌లో ఇటీవల రైల్వే ట్రాకుపై ఓ ఎస్‌యూవీ నడిపిస్తూ స్టంట్లు చేస్తున్న వారిపై ఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు గాను యువకులు వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు, చెన్నైలో కొందరు కాలేజీ విద్యార్థులు రైల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడమే కాకుండా రైల్వే స్టేషన్‌లో గందరగోళం సృష్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. రైలుపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి పది మంది విద్యార్థులపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా అనేక వీడియోలు వెలుగులోకి వస్తుండడంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తోన్న రైల్వే బోర్డు.. అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది.