Mumbai, May 4: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల (Loudspeaker Row) నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాకరే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా (Raj Thackeray’s Deadline Ends) ప్రకటించారు. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఈ నేపథ్యంలో ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్‌స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు.
ఈ పరిస్థితుల ఇలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్‌కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్‌స్పీకర్‌లో హనుమాన్ చాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో.. ఆ పార్టీ కార్యకర్తలు అజాన్ ఇస్తున్న మసీదుల వద్ద ఛాలీసా ఆలపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో రిలీజైంది. ఓ భారీ బిల్డింగ్‌పైన నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద ఉన్న లౌడ్‌స్పీకర్‌లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశాడు. అతని చేతిలో ఎంఎన్ఎస్ పార్టీ జెండా కూడా ఉంది. ఇక ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో అజాన్ కూడా వినిపిస్తున్నట్లు ఉంది.
థానే సిటీలో ఉన్న ఇందిరా నగర్‌లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు హనుమాన్ ఛాలీసాను లౌడ్ స్పీకర్‌లో ప్లే చేశారు. అయితే ఆ సమీపంలో ఎటువంటి మసీదు లేదు. బుధవారం నుంచి ఎక్కడైతే మసీదుల్లో అజాన్ వినబడుతుంతో అక్కడ హనుమాన్ ఛాలీసా ప్లే చేయాలని రాజ్ థాకరే పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో రాజ్ థాకరేను హౌజ్ అరెస్టు చేశారు. ఒకవేళ అజాన్ సౌండ్ వల్ల డిస్టర్బ్ అయితే అప్పుడు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కూడా రాజ్ థాకరే కోరారు. పూణెలో ఉన్న పూనేశ్వర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసుల్ని మెహరించారు. ఆ ఆలయంలో మహా ఆరతి నిర్వహించనున్నట్లు ఎంఎన్ఎస్ పేర్కొన్నది