COVID-19 Pay-cut: తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు, వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వాలు, తొలి అడుగు వేసిన మహారాష్ట్ర సర్కార్
CM Uddhav Thackeray with Maharashtra Cabinet Ministers (File Photo)

Mumbai, March 31:  దేశంలో కరోనావైరస్ వ్యాప్తి (COVID 19 Outbreak) ద్వారా వాటిల్లుతున్న తీవ్ర నష్టాలతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ గండం నుంచి బయట పడేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఖర్చుల నుంచే ఆదా చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి. ఈ క్రమంలో మొట్టమొదటగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు అనుసరించాలనే నిర్ణయానికి వస్తున్నాయి.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో కోత విధిస్తూ (Pay-cut)  నిర్ణయం తీసుకుంది. నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలతో మరియు ఇతర ప్రతినిధుల జీతాలలో ఈ మార్చి నెలకు సంబంధించి 60 శాతం కోత విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన జీతాలలో 25-50 శాతం వేతన కోతను ప్రకటించింది. ఆదా అయిన మొత్తాన్ని COVID-19 ఫండ్‌కు మళ్లించనున్నట్లు పేర్కొంది. అయితే నాల్గవ తరగతి ఉద్యోగులకు వేతనాల కోత నుంచి మినహాయింపునిచ్చారు.

Check the update by ANI

అస్సాం ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి 10-20 శాతం వేతనాన్ని తగ్గించాలని యోచిస్తోంది.

ఇటు జగన్ నేతృత్వం లోని ఏపీ సర్కార్ ఉద్యోగుల సాలరీల  కోత విషయంలో ధైర్యం చేయనప్పటికీ మార్చి నెల వేతనాన్ని రెండు విడతల్లో ఇస్తామని ప్రకటించింది.

సోమవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 75 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు- పెన్షనర్ల నుంచి 50 శాతం భారీ కోతను ప్రకటించిన విషయం తెలిసిందే. వేతనాల్లో కోతను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మరియు కేరళ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 72 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 302కు చేరింది. మరణాల సంఖ్య 8కి చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 కేసులు 1,418, మరణాలు 45 గా నమోదైనట్లు మంగళవారం సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం వెల్లడైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేసులు 8 లక్షలు దాటగా, మరణాలు 40 వేలకు చేరువయ్యాయి.