Hyd, Oct 15: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిని (Maoist Leader RK Death) మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు (Senior Maoist leader RK dies of illness) మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు.
వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. పలు ఎన్‌కౌంటర్లలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతిచర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు, ఛత్తీస్‌ఘ ప్రభుత్వం రూ. 40 లక్షలు, ఒడిసా ప్రభుత్వం రూ. 20 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 12 లక్షలు ఉన్నాయి.
28 ఏళ్ల వయసులోనే విప్లవోద్యమంలోకి వెళ్లిన ఆర్కేకు భార్య శిరీష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. ఓ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమె బెయిలుపై విడుదలయి బహిరంగ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్కే కుమారుడు మున్నా 2016లో ఏఓబీ పరిధిలోని రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 2004లో నాటి పీపుల్స్‌వార్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఏపీ ప్రభుత్వంలో (దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయం) రాజకీయ చర్చలకు సిద్ధమైనప్పుడు ఆర్కే వెలుగులోకి వచ్చారు. చర్చల ప్రక్రియ ప్రారంభానికి ముందే రామకృష్ణ పేరుతో ఆయన కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవ్వాలి అని నాటి పీపుల్స్‌వార్, నేటి మావోయిస్టు నాయకత్వాన్ని ఒప్పించిందే ఆర్కే అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఆ చర్చల్లో తుపాకీలు వీడాలని ఆ తరువాతే డిమాండ్లపై చర్చలు అని ప్రభుత్వం చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం హరగోపాల్ మళ్లీ అడవిబాట పట్టారు. చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు మాస్టర్ ప్లానర్‌గా ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.