MHA Fresh Guidelines: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నూతన మార్గదర్శకాలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచి కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, March 23: దేశంలో రోజురోజుకు కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గతంలోలాగ పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ తాజాగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 'టెస్ట్-ట్రాక్-ట్రీట్' ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. COVID-19 నిర్ధారణ అయిన పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు, వారి కాంటాక్టులను వెంటనే గుర్తించి క్వారైంటైన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు పరచాలి. అలాగే టీకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ వ్యాక్సినేషన్ సామర్థ్యాన్ని పెంచాలని చెబుతూ పలు మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

ఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి మరియు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. MHA జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:

  • దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు UT లు RT-PCR పరీక్షల సంఖ్యను పెంచాలి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని వెంటనే ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. అలాగే వారి పరిచయాలను త్వరగా గుర్తించి క్వారైంటైన్ లో ఉంచాలి.
  • పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా, కంటైన్మైంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలోకి ఇతరుల రాకపోకలను నిషేధించడంతో పాటు ఇంటింటి సర్వే చేపట్టి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పొందుపరచాలి. కంటైన్మెంట్ జోన్ వెలుపల మాత్రం అన్ని కార్యకలపాలకు అనుమతి ఉంటుంది.
  • బహిరంగం ప్రదేశాలలో మరియు రద్దీ ఎక్కువగా ఉండే చోట ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మాస్క్‌లు వాడటం, ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం మరియు సామాజిక దూరం పాటించండం తదితర నిబంధనలు కఠినంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. నిబంధనలు ఉల్లఘించే వారి పట్ల చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు అనుమతి ఉంటుంది.
  • స్థానికంగా కోవిడ్ పరిస్థితులను బట్టి వైరస్ విస్తరణ జరగకుండా ప్రాంతాల మధ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే ఇతర రాష్ట్రాలకు గానీ మరియు రాష్ట్రంలోపల గానీ రవాణాకు సంబంధించి ఎలాంటి నిషేధం ఉండదు. వ్యక్తుల ప్రయాణానికి గానీ, సరకు రవాణాకు గానీ ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు.
  • రైలు ప్రయాణాలలో, మెట్రో రైళ్లు, విమాన ప్రయాణాలు; పాఠశాలలు; ఉన్నత విద్యాసంస్థలు; హోటళ్లు మరియు రెస్టారెంట్లు; షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ మరియు ఎంటర్టైన్మెంట్ పార్కులు; యోగా కేంద్రాలు, జిమ్ సెంటర్లు; ఎగ్జిబిషన్లు, ఇతర సభలు సమావేశాలు, సమ్మేళనాలు తదితర చోట్ల నిర్ధేషిత ప్రమాణాలు అమలులో ఉంటాయి. వాటికి లోబడే కార్యకలాపాలు జరిగేలా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి.
  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. వైరస్ వ్యాప్తి యొక్క చైన్ ను విడగొట్టాలంటే టీకానే కీలకం. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా .రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల పంపిణీ ప్రక్రియ యొక్క వేగాన్ని పెంచాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా అవసరమయ్యే చర్యలు తీసుకోవాలి,