Coronavirus lockdown in India. | (Photo Credits: PTI)

New Delhi, April 30:  కరోనావైరస్ (COVID-19) వ్యాప్తి కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న రెండో ఫేజ్ దేశవ్యాప్త లాక్డౌన్  మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఒకటి వెలువడింది. మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) తెలియపరిచింది. దీనిని బట్టి మూడో ఫేజ్ లాక్ డౌన్ (Lockdown 3.0) ఖచ్చితంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే మరిన్ని జిల్లాలకు మరియు మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలను రాబోయే రోజుల్లో తెలియజేస్తామని హోంశాఖ ప్రతినిధి తమ ప్రకటనలో తెలిపారు.

కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 25 నుండి 21 రోజుల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అనంతరం ఈ లాక్‌డౌన్‌ మే 3 వరకు పొడిగించబడింది.

కాగా, ఏప్రిల్ 14 నుంచి పరిస్థితులను బట్టి కేంద్రం కొన్నికొన్ని సడలింపులు, మినహాయింపులు ప్రకటిస్తూ వస్తుంది. తాజాగా ఈ లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన చాలా మంది విద్యార్థులు, వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులను తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

MHA Tweets on New Lockdown Guidelines:

అందుకు సంబంధించిన సర్క్యులర్ ను కూడా కేంద్ర హోంశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే జారీ చేసింది. తదనుగుణంగా ఆయా రాష్ట్రాలు నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరింది.  వీరందరూ ప్రయాణించేలా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు, బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసే చర్యలను చేయనున్నారు.

మరోవైపు దేశంలో కోవిడ్-19 విజృంభన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువైంది. ఈ దశలో మే 4 నుంచి కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్లు సమాచారం.