June 28: ఇద్దరి మధ్య స్నేహం ఉంటే అది సెక్స్ కు ఒకే అయినట్లు కాదు.. స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.ఆమె లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. ఓ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ భారతీ డాంగ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు వివరాల ప్రకారం.. ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తన స్నేహితురాలిని పలుమార్లు లొంగదీసుకున్నాడు. తీరా గర్భం దాల్చాక.. మాట మార్చాడు. ఈ వ్యవహారంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అతను దాఖలు చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్ ఆదేశించింది.
ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉంటే.. అది ఆమెతో లైంగిక సంబంధాన్ని(sexual relationship) ఏర్పరచుకోవడానికి ఆమె ఇచ్చిన సమ్మతిగా భావించడానికి వీల్లేదని (Friendliness not consent for physical relationship) జస్టిస్ భారతి అభిప్రాయపడ్డారు. స్నేహం అనేది బలవంతంగా వాళ్లను(మహిళలను) లొంగదీసుకునేందుకు మగవాళ్లకు దొరికే హక్కే ఎంత మాత్రం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేసులో ఆమె అతని పట్ల ఆకర్షితురాలైందని, కానీ, పెళ్లి ప్రస్తావనతో అతనికి లొంగిపోయిందా? లేదంటే బెదిరింపులకు, బలవంతం చేశాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.