Mumbai, February 16: మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా రాజధాని ముంబై నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నట్లు పాలకులే సంకేతాలు ఇస్తున్నారు. ముంబై నగరంలో ప్రజలు కోవిడ్ నిబందనలు పాటించడం లేదని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ (Mumbai Lockdown) విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ (Mayor Kishori Pednekar) హెచ్చరించారు.
ముంబైలో పెరుగుతున్న కోవిడ్-19 (Mumbai Covid 19) పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని సీరియస్ అయ్యారు.
మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలి. మళ్లీ లాక్‌డౌన్ విధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని మేయర్ కిషోరి పండేకర్ అన్నారు. ఇదిలా ఉంటే మూడు నెలల నిర్బంధ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా చాలా మంది నష్టపోయారు.
మహారాష్ట్ర రాజధానిలోని ముంబై, పూణే, నగరాలతోపాటు విదర్భ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే 400 కరోనా కేసులు (Maharashtra Coronavirus) వెలుగుచూశాయి. ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 3,14,569కి చేరింది. ప్రస్తుతం 5,531 మంది కరోనా రోగులున్నారు. ముంబై నగరంలో కరోనా ప్రబలిన ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ముంబై నగరంలోని బోరివలి ప్రాంతంలో అత్యధికంగా 408 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ANI Tweet
It's a matter of concern. Most people travelling in trains don't wear masks. People must take precautions else we'd head towards another lockdown. Whether lockdown will be implemented again, is in the hands of people: Kishori Pednekar, Mumbai Mayor on surge in COVID cases in city pic.twitter.com/IJgMVUJVJm
— ANI (@ANI) February 16, 2021
కరోనాతో బోరివలిలో 643 మంది మరణించారు.అంధేరి వెస్ట్, జోగేశ్వరి వెస్ట్, విలే పార్లే, ప్రాంతాల్లో378 కరోనా కేసులు నమోదైనాయి. 573 మంది కరోనాతో మరణించడంతో ఈ ప్రాంతంలో కరోనా నిరోధానికి 100 భవనాలకు అధికారులు సీలు వేశారు. కాండీవలి, చార్ కోప్ ప్రాంతాల్లో 345 కరోనా కేసులు నమోదు కాగా 552 మంది మరణించారు. మలాద్, మనోరి, మార్వీ, అక్సా, మధ్ ప్రాంతాల్లో కరోనా కలవరం సృష్టిస్తోంది. ములుంద్ ప్రాంతంలో 202 భవనాలు, ఘట్ కోపర్, విద్యావిహార్, పంత్ నగర్ ప్రాంతాల్లో 162 భవనాలకు మున్సిపల్ అధికారులు సీలు వేశారు.
14 మురికివాడలను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించారు.భాండప్, పొవాయ్, కంజూర్ మార్గ్, విఖ్రోలి, నహూర్, ప్రాంతాల్లో 10 మురికివాడలను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించి కరోనా నిరోధానికి చర్యలు చేపట్టారు. ముంబై నగరంలో 85 కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించి కరోనా హాట్ స్పాట్లు అయిన 992 భవనాలకు సీలు వేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.