Chennai, April 18: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. దోసె వేయలేదనే కోపంతో ఓ భర్త.. తన భార్యను కత్తితో పొడవడంతో సోమవారం ఉదయం మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా మాత్తూరు సమీపంలోని ఎన్.మోటూరు గ్రామానికి చెందిన గణేశన్ (60).. గత 11వ తేదీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత తనకు దోసె చేయాలని భార్యను అడిగాడు.
దీంతో ఆమె మూడు దోసెలు వేసి ఇచ్చింది. అయితే గణేశన్ మరో 3 దోసెలు అడిగాడు. భార్య గ్యాస్ సిలిండర్ అయిపోయిందని తెలిపింది. దీంతో తీవ్ర కోపంతో గణేశన్ కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికాడు.దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా(2)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న మాత్తూరు పోలీసులు గణేశన్‌ను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాన్ చికిత్స ఫలించక సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.