New Delhi, OCT 12: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh Meets Amit Shah) కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేశ్. చివరికి తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలను కూడా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు కంప్లైంట్ చేశారు లోకేశ్. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీపై ఎన్ని కేసులు పెట్టారు? అని లోకేశ్ ను అడిగారు అమిత్ షా. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది? అని కూడా అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు అమిత్ షా. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా పాల్గొన్నారు.
ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (IRR Case) విచారణకు హాజరైన నారా లోకేశ్.. సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. పురంధేశ్వరి, కిషన్ రెడ్డి సమక్షంలో అమిత్ షా నివాసంలో ఆయనను లోకేశ్ కలిశారు. చంద్రబాబు అరెస్ట్, తమ కుటుంబంపై ఏ విధంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అన్నది అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నారా లోకేశ్.
కేసులు పెట్టి విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని అమిత్ షాకి ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివిధ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, విచారణ జరుగుతోందని, న్యాయపోరాటం చేస్తున్నామన్న అంశాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నారా లోకేశ్. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఇది కరెక్ట్ కాదన్న అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. 73ఏళ్ల వయసున్న వ్యక్తిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదు, మంచిది కాదు అన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం గురించి, ఆయన యోగ క్షేమాలు గురించి అమిత్ షా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
గతంలో నారా లోకేశ్ రాష్ట్రపతిని కలిసి సీఎం జగన్ పై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ఇప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షాని కలిసి జగన్ పై నారా లోకేశ్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది. పలు కేసులపై విచారణలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు.. ఇవన్నీ కూడా దర్యాఫ్తు దశలో ఉన్నాయి. అంతేకాదు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు. కోర్టుల పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కానీ, వివరణ అడగటం కానీ ఇటువంటివి ఏవీ జరగవు.