
Newdelhi, Feb 16: ఢిల్లీ రైల్వేస్టేషన్ లో (Delhi Railway Station) జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైన వారికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. కాగా శనివారం రాత్రి ఈ తొక్కిసలాట (Stampede) సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా.. 13, 14 ప్లాట్ ఫామ్ లపై ప్రత్యేక రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయి స్పృహ కోల్పోయారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
అందుకేనా?
ప్రయాగ్ రాజ్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్ ఫాంపై ఉండటంతో కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే, కుంభమేళాకే వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్ ఫ్లాంపై ఉండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అనుమానిస్తున్నారు.
భయానక దృశ్యాలు
ఇప్పటికే కుంభమేళలో గతంలో మౌనీ అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట జరిగి.. 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి సీరియస్ గా ఉంది. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేషన్ లో నెలకొన్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ప్రధాని దిగ్భ్రాంతి
తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్టు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు రైల్వేశాఖ తెలిపింది.