No language can be imposed: Rajinikanth after Amit Shah's Hindi row (Photo Credit - PTI )

Chennai, September 18 : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీని తప్పనసరిగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పట్ల చెలరేగిన దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ దగ్గర నుంచి సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ దీన్ని ఖండిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అగ్గి రాజుకుంటోంది. మక్కళ్ నీథి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్, అలాగే డీఎంకే అధినేత స్టాలిన్ దీన్ని తీవ్రంగా ఖండించారు. బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఈ విషయం మీద దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం పెదవి విప్పారు. బీజేపీ సానుభూతిపరునిగా గుర్తింపు ఉన్న రజినీకాంత్ అమిత్ షా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారని చెప్పవచ్చు.

చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతున్న రజినీకాంత్

కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సూపర్ స్టార్ రజినీకాంత్ కౌంటర్ వేశారు. ‘ఒకే దేశం ఒకే భాష’ అంటున్న నరేంద్ర మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. హిందీని ఉమ్మడి భాషగా చేయాలన్న అమిత్ షా ప్రతిపాదనను రజినీకాంత్ తప్పుపట్టారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు ఒకే భాష మంచిదే కావొచ్చు. కానీ, దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదని, దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఒప్పుకోవని స్పష్టంచేశారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.  ఉద్యమానికి ఆజ్యం పోస్తున్న అమిత్ షా '' హిందీ '' వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరో జల్లికట్టు ఉద్యమం తప్పదన్న కమల్ హాసన్

కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. పైగా, అమిత్‌ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. స్టాలిన్‌, కమల్‌ హాసన్‌, మమతా బెనర్జీ వంటి పలువురు నేతలు కూడా షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు వీరితో రజినీకాంత్ కూడా జతకలిశారు.

హిందీ మాత్రమే కాదు.. ఏ భాషనైనా దేశం మొత్తం మీద అమలయ్యేలా చేయడం సరికాదని రజినీకాంత్ స్పష్టం చేశారు. బలవంతంగా అమలు చేయాల్సి వస్తే.. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా హిందీని అమలు చేయడానికి ముందుకు వస్తాయని తాను అనుకోవట్లేదని చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గర మీడియా మిత్రులతో రజినీకాంత్ తమిళంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండటం మంచిదే అయినప్పటికీ.. విభిన్న సంస్కృతులు, వేర్వేరు భాషలను మాట్లాడుతున్న భారత్ లో అది సాధ్యపడదని అన్నారు.

ఇదిలా ఉంటే హిందీని ఉమ్మడి భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యల మీద తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. హిందీని బలవంతంగా రుద్దాల్సి వస్తే.. తమిళనాడులో మరో జల్లికట్టు తరహా ఉద్యమం తలెత్తుతుందంటూ కమల్ హాసన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏ షా, సామ్రాట్, సుల్తాన్ కూడా దేశ ఐక్యతను దెబ్బతీయలేరని దీని వల్ల చాలా మంది బాధపడాల్సి ఉంటుందని కమల్ హాసన్ హెచ్చరించారు.

కొద్ది రోజుల ముందు  అమిత్ షా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా అందరికీ ఒకే భాష అనేది తప్పక ఉండాలి. అప్పుడే విశ్వవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు వస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై వరుసగా ఒక్కొక్కరు నిరసన గళం వినిపిస్తున్నారు.