Allahabad, Nov 26: మైనర్ బాలునిపై లైంగిక దాడి కేసులో అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సంచలన తీర్పును వెలువరించింది. బాలునితో ఓరల్ సెక్స్‌ను ఘోరమైన నేరంగా పరిగణించలేమని (Oral Sex With Minor Not Aggravated Sexual Assault ) అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా నిందితుని శిక్షను పదేళ్ల నుంచి ఏడేళ్లకు కుదించింది. 2016 నాటి కేసులో దాఖలైన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ అనిల్ కుమార్ ఓజాతో కూడిన సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది.
అంతకుముందు ఈకేసును విచారించిన ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 377, 506లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద నిందితున్ని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితునికి పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద శిక్షను విధించింది. ఈ మేరకు నిందితునికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5000 జరిమానాను విధించింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాలు చేశాడు. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఈ కేసులో అనుచితంగా శిక్షను తగ్గిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై న్యాయ నిపుణులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2016లో ఝాన్సీ జిల్లాలోని చిర్‌గావ్ గ్రామానికి చెందిన సోను కుష్వాహా అనే వ్యక్తి, దేవ్ సింగ్ ఇంటికి వచ్చి తన పదేళ్ల బాలుడిని గుడికి తీసుకువెళ్తున్నానని చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. ఎవరూ చూడని ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ బాలునికి రూ. 20 ఇచ్చి ఓరల్ సెక్స్ (పురుషాంగ చూషణ) చేయాలని కోరాడు. బాలుడు నిరాకరించినప్పటికీ బలవంతంగా ఓరల్ సెక్స్ (Oral Sex With Minor) చేశాడు. అనంతరం భాలుడు ఆ డబ్బుతో ఇంటికి చేరాడు. ఇంటికి రాగానే బంధువుల్లో ఒకరు బాలుని చేతిలో ఉన్న డబ్బు గురించి ఆరా తీశారు. దీంతో బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు.
ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఝాన్సీ జిల్లాలో నిందితునిపై పోలీసుకులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సోను కుష్వాహాపై ఐపీసీ సెక్షన్ 377, 506, పోక్సో చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనిని విచారించిన దిగువ కోర్టు సోనును దోషిగా నిర్ధారిస్తూ తీర్పును ఇచ్చింది. తర్వాత ఈ కేసు అలహాబాద్ కోర్టుకు చేరింది. తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 377, సెక్షన్ 506, పోక్స్ యాక్ట్ సెక్షన్ 6ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కాడు.
తాజాగా ఈ ఘటనపై హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలవరించింది. నోటిలో పురుషాంగాన్ని ఉంచడం అనేది తీవ్రమైన లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని, పోక్సో చట్టంలోని (Under POCSO Act) సెక్షన్ 4 కింద మాత్రమే నిందితుడికి శిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 6 పరిధిలోకి ఈ కేసు రాదని తెలిపింది.ఈ తీర్పు పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.