
New Delhi, Apr 24: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపునుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ‘‘ఆ వ్యక్తిని ఉరితీస్తాం’’ అంటూ (If Anyone Obstructs Oxygen Supply, We Will Hang Him) హెచ్చరించింది.
తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం (Delhi High Court) ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలనీ.. అతడిని తాము ‘‘ఉరి తీస్తా’’మని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా... వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. అంతేకాక ఇలాంటి అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం వారి వారి మీద తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వెల్లడించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు మూడు లక్షలకు పైగానే ఉంటున్నాయి.
ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ఈ సారి ఆక్సిజన్ వినియోగం అత్యధికంగా ఉంది. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు దగ్గరపడుతుండటంతో కొత్త వారిని చేర్చుకోవడం లేదు. ఇక ఢిల్లీ, రాజస్తాన్ వంటి చోట్ల ఆక్సిజన్ కొరతతో (Oxygen Shortage in Delhi) పలువురు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.