New Delhi, Dec 7: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలను (Parliament Winter Session) బహిష్కరించారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు పార్లమెంట్ బహిష్కరిస్తున్నామని (TRS MPs to boycott Parliament's Winter Session) వారు ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉభయసభల టీఆర్ఎస్ సభ్యులు నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదాపడింది.
లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఉభయసభలకు చెందిన టీఆర్ఎస్ సభ్యులు 16 మంది (9 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు) నిరసన ప్రదర్శన చేపట్టారు. ధాన్యం సేకరణపై (Paddy Procurement Issue) ప్రభుత్వం సమగ్ర విధానం తీసుకురావాలని ప్రధానంగా తమ డిమాండ్‌ను వినిపించారు. అదేవిధంగా పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరికొన్ని ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు తమ డిమాండ్‌లు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు (TRS MPs) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు మీడియాతో మాట్లాడారు. మోదీది ఫాసిస్ట్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీపై తిరుగుబాటు చేసేలా సమాయత్తం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఆందోళనలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. చట్టసభను బాయ్‌కాట్ చేయడం బాధ కలిగించే విషయమే.. కానీ కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కేకే స్పష్టం చేశారు. సభను బాయ్‌కాట్ చేయాలని ఎవరూ కోరుకోరు అని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రా రైస్ రాదు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మారుస్తాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు అని ఎంపీ కేకే పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్‌లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు. రైతులతో రాజకీయం చేయొద్దు అని ఎంపీ హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొంటారా? కొనరా? అని కేంద్రాన్ని అడిగాం. ఈ అంశంపై పార్లమెంట్ సాక్షిగా 9 రోజుల పాటు టీఆర్ఎస్ ఎంపీలమంతా నిరసన తెలిపాం. ఎవరూ ఊహించని విధంగా పోరాటం చేశాం.
మా సమస్యకు పరిష్కారం చూపాలని నిరసన తెలిపాం. బీజేపీ నాయకులు తమను పట్టించుకోలేదు. తమ రైతాంగం రెండు పంటలను పండిస్తుంది. ధాన్యం కొంటారా? కొనరా? అని అడిగాం. బాయిల్డ్ రైస్ విషయంలో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. పార్లమెంట్లో మేం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.