Parliament Budget Session 2022: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ
PM Narendra Modi Address in Parliament (Photo Credits: Twitter/ ANI)

New Delhi, Feb 8: పార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని (Andhra Pradesh) హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల ఏర్పాటైన రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో ( PM Narendra Modi Continues Attack In Parliament) విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించిన తీరుపై (Andhra Pradesh Bifurcation) కూడా ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు.

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన (Andhra Pradesh Reorganisation Act) జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు.

వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు, పార్లమెంట్‌లో ఏకి పారేసిన ప్రధాని మోదీ, లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ఉభయ సభలు

ప్రపంచ దేశాలన్నిటినీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేసిందని, యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, కేవలం మన దేశంలో మాత్రమే దీనిని అదుపులో ఉంచగలిగామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు.

100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత విపత్తు కోవిడ్-19 మహమ్మారి రూపంలో వచ్చిందన్నారు. ఇటువంటి విపత్తును వందేళ్ళలో మానవాళి కనీ వినీ ఎరుగదని చెప్పారు. ఈ సంక్షోభం తన రూపాలను మార్చుకుంటూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. యావత్తు భారత దేశం, ప్రపంచం దీనితో పోరాడుతోందని చెప్పారు. సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలందరికీ ఈ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం కొత్త విధానాలతో చర్యలు తీసుకోవచ్చుననే భరోసా కలిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఓ ఉదాహరణగా మన దేశం నిలిచిందన్నారు. భారత దేశంలోనే తయారైన వ్యాక్సిన్లను ఇస్తూ, కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను అత్యధికంగా చేపట్టిన దేశంగా భారత దేశం నిలిచిందని తెలిపారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా అందించినట్లు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌కు ఆధార్ తప్పనిసరి కాదు, ఎవ‌రి వ‌ద్ద ఆధార్ ఇవ్వాల‌ని వ‌త్తిడి చేయ‌రాదని అధికారుల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

ద్రవ్యోల్బణం యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోందని చెప్పారు. 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయి ద్రవ్యోల్బణం అమెరికాలో ఉందని, 30 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో బ్రిటన్‌లో ఉందన్నారు. యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాము 2015-2020 మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నించామన్నారు. ఈ కాలంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం నుంచి 5 శాతం వరకు ఉండేదన్నారు. కాంగ్రెస్ నేత‌ృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యలో ఉండేదని చెప్పారు. నేడు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు ఉన్న ఏకైక భారీ ఆర్థిక వ్యవస్థ భారత దేశమేనని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. భారత దేశమంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ లేకపోయుంటే ఏం జరిగేది? అని కొందరు సభ్యులు అడుగుతున్నారని, ఈ ప్రశ్నకు తన సమాధానం ఇదేనని అంటూ, కాంగ్రెస్ లేకపోయుంటే, దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలయ్యేది కాదన్నారు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కాదన్నారు. సిక్కులు ఊచకోతకు గురై ఉండేవారు కాదని చెప్పారు. కశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదన్నారు.

మోదీ మాట్లాడుతూండగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పారు. ప్రజాస్వామ్యం, చర్చలు మన దేశంలో అనేక శతాబ్దాల నుంచి ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తన వంశానికి భిన్నంగా దేనినీ చూడలేదని, ఆలోచించలేదని, ఇదే ఆ పార్టీ సమస్య అని ఆరోపించారు. కుటుంబంపై ఆధారపడిన పార్టీల వల్ల భారత దేశ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడుతోందన్నారు. దీనివల్ల ప్రతిభావంతులు దూరమవుతున్నారని, ఇదే పార్టీలకు జరుగుతున్న అతి పెద్ద నష్టమని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ సమాఖ్య తత్వం (ఫెడరలిజం) గురించి ఉపన్యాసాలు ఇస్తుందన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాత్రం ముఖ్యమంత్రులను చిల్లర విషయాలపై తొలగిస్తుందని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి కుమారుడు విమానాశ్రయంలో ఏర్పాట్లు ఇష్టపడనందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని తొలగించిందన్నారు. అదేవిధంగా కర్ణాటకలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అగౌరవంగా తొలగించిందన్నారు. అది కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేనపుడు తొలగించిందన్నారు. ఇటువంటి సంకుచిత ఆలోచనా ధోరణితో బీజేపీ పని చేయదని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చినట్లయితే దేశం ప్రగతి సాధిస్తుందని తెలిపారు.