New Delhi, Feb 4: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి 14 సార్లు సమాధానం ఇచ్చే అదృష్ట్యాన్ని దేశ ప్రజలు తనకు ఇచ్చారని, ఇందుకు తాను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi Speech in Lok Sabha) అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిచ్చారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ..దేశ ప్రజలు వరుసగా నాలుగోసారి తనను ఆశీర్వదించారని, అందుకు తాను దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ఆయన చెప్పారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని వెల్లడించారు. పేదల గుడిసెల్లో ఫొటోలకు ఫోజులిచ్చే వారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడితే వినడం బోరింగ్‌గానే ఉంటుందని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మరోసారి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు. వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. కొందరు నేతలు బంగ్లాలు కట్టుకోవడంపై దృష్టిసారించారు. మేం మాత్రం ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వడంపై దృష్టి పెట్టాం. దేశంలో పేదల కోసం 12 కోట్లకుపైగా మరుగుదొడ్లు కట్టించామన్నారు.
ప్రధాని తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కొందరు నేతలు పేదల గుడిసెల వద్ద వారితో ఫొటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తారు. సభలో పేదల గురించి మాట్లాడితే.. ఫొటోలకు ఫోజులిచ్చిన నేతలు మొహం విసుగ్గా పెడతారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే.. గ్రామాలకు 16పైసలే చేరుతోందని గతంలో ఓ ప్రధాని వాపోయారు. అప్పట్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోంది. నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజలకే ఇప్పుడు సొమ్ము అందుతోంది అని తెలిపారు.
మనం 2025లో ఉన్నారు. ఒకరకంగా 21వ శాతాబ్దంలో 25 శాతం ముగిసిపోయింది. 20వ శతాబ్దంలో స్వాతంత్ర్యం తరువాత, 21వ శతాబ్దంలో 25 ఏళ్లలో ఏం జరిగిందనేది కాలమే చెబుతుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, రాబోయే 25 ఏళ్లలో, వికసిత్ భారత్ దిశగా ప్రజల్లో విశ్వాసం పాదుకొలపే దిశగా పనిచేయనున్నాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది. సరికొత్త ధీమాను కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది'' అని మోదీ అన్నారు.
డిజిటల్ సాంకేతికత ద్వారా పారదర్శకత పెంచాం. పది కోట్ల నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించాం. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాం. గతంలో తరచూ రూ.లక్షల కోట్ల అవినీతిపై రోజూ వార్తలు వచ్చేవి. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలే లేవు. కొందరు శీష్ మహల్ నిర్మాణం కోసం అవినీతి చేస్తారు. మా హయాంలో మౌలిక వసతుల కల్పనపై భారీగా వెచ్చించాం. కేంద్రంలో పదేళ్లుగా అవినీతి లేకపోవడంతో జనం లాభపడ్డారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుతో రోగులకు ఎంతో మేలు జరిగిందన్నారు ప్రధాని మోదీ.