New Delhi, December 13: భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాక్ అయింది. పీఎం ఖాతాను హ్యాక్ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది. వాటిని భారతీయులకు పంచాలని నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్‌ను షేర్ చేయటానికి త్వరపడండి. మీ అందరి భవిష్యత్తు ఈ రోజే ఆవిష్కృతమైంది’ అనే సందేశాన్ని పోస్ట్ (Bitcoin Post) చేసి ఓ లింక్ ఇచ్చారు.
దీంతో అలర్ట్ అయిన ప్రధానమంత్రి కార్యాలయం ( PMO) ట్విట్టర్ సాయంతో తిరిగి దానిని స్వాధీనంలోకి తెచ్చింది. ‘ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా (PM Narendra Modi’s Twitter Account) ఆదివారం కొద్దిసేపు హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకుపోవటంతో సరిచేశారు. హ్యాక్ అయిన సమయంలో అందులో ఉంచిన సందేశాలను ఎవరూ నమ్మొద్దు’ అని పీఎంవో ప్రకటించింది. కాగా 2020 సెప్టెంబర్‌లో కూడా మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే సైబర్ నేరగాళ్లు గతంలో చాలామంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్‌చేశారు.
అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు పలువురు సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలను హ్యాక్‌చేసి బిట్‌కాయిన్‌ను ప్రమోట్‌చేసేలా సందేశాలు పెట్టారు. బిట్ కాయిన్ కరెన్సీని నియంత్రించటం కష్టం కాబట్టి దేశంలో మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల సరఫరా పెరిగిపోతాయన్న భయాలు వ్యక్తమవుతుండటంతో భారత్‌లో క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయటంపై ప్రధాని మోదీ వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురికావటం గమనార్హం.