![](https://test1.latestly.com/wp-content/uploads/2021/05/mehulchoksi.jpg)
New Delhi, May 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (Fugitive Diamantaire Mehul Choksi) అదృశ్యమయ్యారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ.. కనిపించకుండా పోయారని (Mehul Choksi is Missing in Antigua) ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ ( Lawyer Vijay Aggarwal) వెల్లడించాడు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్ మోదీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతారు. అయితే ఇండియాకు అప్పగిస్తారనే భయంతోనే ఆయన పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా ఆయన క్యూబాకి పారిపోయి ఉంటారని ఓ అధికారి చెప్తున్నారు. ఇండియాకు క్యూబాకు మధ్య నేరస్తుల అప్పగింతల ఒప్పందాలేవీ లేవు. అందుకే అక్కడికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
చోక్సీ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను సీబీఐ, ఈడీలు దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మాట్లాడుతూ.. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేసి అతడిని భారత్‌కు అప్పగిస్తామని చెప్పారు.
కాగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చోక్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. అతడిని కూడా భారత్‌కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.
మొత్తం రూ.13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి నెల రోజుల ముందే 2018 జనవరి 4 అంటిగ్వాకు చెక్కేశారు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. 2013లో స్టాక్ మార్కెట్ మోసం కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. చోక్సీ కేవలం భారతీయ బ్యాంకులనే కాదు, దుబాయ్, అమెరికాలకు చెందిన వ్యాపారులు, కస్టమర్లను మోసం చేసినట్టు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అతడికి చెందిన రూ.2,500 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. అయితే, అంటిగ్వా-బార్బుడా ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు.