Ongole, May 24: ప్రకాశం జిల్లాలో 2008లో సంచలనం రేపిన జాతీయ రహదారులపై హత్య కేసులో మున్నా సహా 12 మందికి ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్‌కోర్టు ఉరిశిక్ష (death sentence) ఖరారు చేసింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ ఒంగోలు ఫ్యామిలీ కోర్టు తీర్పు (Ongole court sentenced munna and 10 others to death) ఇచ్చింది. ఈ మేరకు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది.
అప్పటి కోల్‌కతా- చెన్నై 16వ నెంబర్ జాతీయ రహదారిపై కొన్ని లారీలు, సిబ్బంది, వాటిలో ఉన్న సరకు అదృశ్యం అయిన కేసుల్లో మున్నా హస్తం ఉన్నట్లు ఇటీవల నిర్ధారించిన కోర్టు 3 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని ఈ మున్నా గ్యాంగ్ హత్య చేసింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులుగా కోర్టు నిర్ధారించింది.
2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈనెల 18న పేర్కొన్నారు. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు న్యాయమూర్తి నిర్ధారించారు.
కేసుల చరిత్ర ఇదే..
13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై లారీలు, సరకు సిబ్బంది అదృశ్యం అయిన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కారణాలు అంతు చిక్కలేదు. ఒక కేసుకు సంబంధించి అప్పట్లో డీఎస్పీగా శిక్షణ పొందుతున్న దామోదర్‌కు చిన్న ఆధారం లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయానికి గురి చేసిన విషయాలు తెలిశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకొని ఈ హత్యలు చేసినట్లు తెలిసింది.
గతంలో గుప్త నిధుల పేరుతో ధనవంతుల్ని నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, హతమార్చిన కేసుల్లో అబ్దుల్ సమ్మద్ నిందితుడు. 2008లో జాతీయ రహదారిపై అధికారిలా కాపుకాసి, లోడ్‌తో వస్తున్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరడం, అదును చూసి మెడలో తాడువేసి, బిగించి హతమార్చేవాడు. మృతదేహాలను బస్తాల్లో కుక్కి తోటల్లో అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని సరకును మాయం చేసేవాడు. మద్దెపాడులో ఓ పాడుబడ్డ గొడౌన్‌ను అద్దెకు తీసుకొని అక్కడ లారీని తుక్కుగా మార్చి సరకులు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. అలా ఆ జాతీయ రహదారిలో 13 మందిని హత్య చేసినట్లు విచారణలో తేలింది.
ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ పనేనని తెలుసుకున్నారు. కిల్లర్ మున్నాను, ఆయన అనుచరుల్ని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే మున్నాకు బెయిల్ రావడంతో బెంగళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.
అతడి కోసం గాలింపు చేపట్టారు. అప్రమత్తమైన మున్నా.. దేశం వదిలి పారిపోయేందుకు యత్నించాడు. అయితే ఎట్టకేలకు కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అతడిని అరెస్టు చేసిన కర్నూలు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మున్నా, అతని గ్యాంగ్ మీద ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది. నేరాలు రుజువవ్వడంతో మున్నా సహా 19 మందికి శిక్ష ఖరారు చేసింది. 12 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.