Pune, july 14: దేశంలో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఎవరో జ్యోతిష్కుడు.. నీవు ఎమ్మెల్యే కావాలంట నీ భార్యను వదిలేయాలని చెప్పడంతో భార్యను వదిలించుకునేందుకు ఓ భర్త అనేక ప్రయత్నాలు చేసి చివరకు జైలు (dowry harassment case) పాలయ్యాడు. ఈ దారుణ ఘటన పూణేలో (Pune) జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పూణేకు చెందిన రఘునాథ్ రాజారామ్ ఎమూల్ (48)కి (Raghunath Rajaram Yemul) ఎమ్మెల్యే అవ్వాలని కోరిక బలంగా ఉండేది. దీంతో ఆయన బాబాల బాట పడ్డాడు.
జ్యోతిష్కుడు (Astrologer).. నీ భార్యని వదిలిస్తే నీకు కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులు వస్తాయని.. ఆమెతో కలిసి ఉన్నంతకాలం ఏ పదవీ దక్కదు’’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఆ జ్యోతిష్కుడు మాటలను బలంగా నమ్మిన అతడు తన భార్య (27)ను వదిలించుకునేందుకు అనేక రకాలైన పన్నాగాలు పన్నాడు. సూటి పోటి మాటలతో మానసికంగా వేధించడం.. సిగరెట్లతో ఆమె శరీరంపై గాయాలు చేయడం వంటి దారుణపు పనులకు పాల్పడ్డాడు.
ఇంకా అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు సైతం ఆమెను చిత్ర హింసలకు గురిచేసేవారు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆ మహిళ పోలీసు స్టేషన్ గడప తొక్కింది. తన భర్తతో సహా ఎనిమిది మందిపై చతుర్ష్రింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణలో బాబా చెప్పినట్టే తాను ప్రవర్తించానని రఘునాథ్ చెప్పాడు. మాయ మాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్న ఆ బాబాని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా ఈఘటనపై స్పందిస్తూ.. జ్యోతిష్కుడు లేని పోనివి ఆమె భర్తకు కల్పించాడని అందువల్లే అతను భార్యను చిత్రహింసలకు గురి చేశాడని తెలిపారు. రెండు రోజుల క్రితం అతనిని అరెస్టు చేసాము. అతన్ని కోర్టుకు హాజరుపరిచారు. తదుపరి దర్యాప్తు కోసం అతన్ని ఒక రోజు పోలీసు కస్టడీలో ఉంచామని తెలిపారు. అలాంటి వ్యక్తి కారణంగా ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటే ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయమని గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది నిందితులకు ముందస్తు బెయిల్ లభించగా, పరారీలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త కోసం పోలీసులు శోధిస్తున్నారు.