Vjy, Nov 27: ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.
విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దీని వెనుక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో, న్యాయస్థానం విజయపాల్ కు రెండు వారాల రిమాండ్ విధించింది.
రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో వచ్చారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు.‘‘ రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆయన్ను చంపడానికి ప్రయత్నించారు. తనపై దాడి విషయాన్ని రఘురామ కోర్టులో చెప్పారు. తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ వైద్యులూ నిందితులే.
ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని విచారించాం. నాడు విచారణ సందర్భంగా ఉన్నవారినీ విచారించాం. రఘురామపై దాడి జరిగినట్టు నిర్ధరణకు వచ్చాం. ఆయనను వేధించిన విషయం వీడియో తీసి అప్పటి పెద్దలకు పంపించారు. వారు ఎవరనేది త్వరలో తేలుతుంది’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.