Hyderabad, January 04: కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే హైదరాబాద్లో (Hyderabad)ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు..వానలు.. మూడురోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబరు వరకు చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నగరంలో 14 మి.మీ వర్షపాతం నమోదైంది.
కాగా 1922 నుండి ఇప్పటివరకు జనవరిలో నమోదైన వర్షపాతాలలో 36. మి.మీ వర్షపాతంతో ఈ సంవత్సరం రికార్డులకెక్కింది. రాగల 48 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Hyderabad Rains) కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
'ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల నగరంలో మరింత తడి వాతావరణం (hyderabad weather) ఉంటోంది. ఈ తేమ గాలులు వల్ల మేఘాలు ఏర్పడి వర్షం పడుతోంది'' అని భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తడి వాతావరణం ఉంటుందని నగరంలోని అధికారులు తెలిపారు. జనవరి 4 వరకూ మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్‌లో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో చలిగాలులు కూడా ఎక్కువగా ఉంటాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సరాసరిన 2 నుంచి 3 డిగ్రీలు పడిపోయే అవకాశాలున్నాయని వెల్లడించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వివరించారు.
స్కైమేట్ వాతావరణ సంస్థ జనవరి 4 తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని తన నివేదికలో వెల్లడించింది. తూర్పు, పశ్చిమ దిశనుండి వీస్తున్న పవనాల కారణంగా, నగరంపై వర్షం పడే మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని ప్రాంతాలలో ప్రబలంగా ఉంది. అయినప్పటికీ, తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్రా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో అక్కడక్కగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతల్లో గురు, శుక్రవారాల్లో సైతం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.