Flooded ward in Osmania Hospital | Photo: Twitter

Hyderabad, July 15:  హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి బుధవారం వరద నీటితో నిండిపోయింది. నగరంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఆసుపత్రిలోకి వర్షపు నీరు వరదలా పోటెత్తింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వారిని పర్యవేక్షించే వైద్య సిబ్బందికి కూడా ఈ పరిస్థితి అసౌకర్యంగా మారింది.

నిజాం కాలం నాటి ఈ ఆసుపత్రి పాతబస్తీలోని భారీ జనాభాకు వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిని కరోనా నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్సకు కూడా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆసుపత్రిలోకి వరదలు రావడం, ఆ వరద నీటిలో మురుగు నీరు కలుస్తుండటంతో అది సమస్యలకు దారితీస్తుంది. గత మూడు రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. సోమవారం కూడా ఇదే తరహాలో ఆసుపత్రిలోకి వరదలు వచ్చాయి.

Watch the video here:

ఇదే అదనుగా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు అని కాంగ్రెస్ విమర్శించగా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యపు ధోరణా అంటూ నిలదీస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఏ క్షణానైనా కూలవచ్చు, వందల కోట్లతో సెక్రెటేరియట్ నిర్మించడం మాని, ఆ ఖర్చు ఆసుపత్రులకు వెచ్చించాలంటూ సూచిస్తున్నారు.

అయితే, సీఎం కేసీఆర్ గతంలోనే 2016లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉస్మానియా చాలా పురాతనమైనది, దీనిని కూల్చివేసి కొత్త ఆసుపత్రి నిర్మిస్తామని ప్రతిపాదనలు చేశారు. ఆసుపత్రిలోని రోగులను ఇతర ఆసుపత్రుల్లోకి మార్చే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పక్షాలు, మరికొంత మంది సామాజికవేత్తలు కోర్టుల్లో కేసులు వేశారు. ఉస్మానియా హైదరాబాద్ వారసత్వ సంపద, దీనిని కూల్చకూడదు అంటూ పట్టుపట్టారు. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తెలంగాణలో చాలా పెద్దది మరియు పురాతనమైనది. దీనిని అప్పటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఇది 1910 నుంచి వైద్య సేవలు అందించడం ప్రారంభించింది. అప్పట్లో హైదరాబాద్ నిజాం ఈ ఆసుపత్రి నిర్మాణానికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌ను రూపొందించిన బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్చ్ ఉస్మానియా ఆసుపత్రికి కూడా వాస్తుశిల్పి.