Mumbai, Oct 10: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఆయన గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని చెప్పారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.భారత ప్రభుత్వం తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దాదాపు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు సంతాపం తెలిపారు.