Bangkok, Novemebr 5: వ్యాపారానికి కీలకమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్) (Regional Comprehensive Economic Partnership) ఒప్పందంలో భారత్ చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ఆర్‌సీఈపీ(RCEP)లో చేరితే భారత్‌లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్(Bangkok)లో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ వాణిజ్య ఒప్పందంపై భారత ఆందోళనపై దృఢ వైఖరి ప్రదర్శించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
భారత్ వ్యక్తం చేసిన ఆందోళనకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చోటుచేసుకోనందున, దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై రాజీపడరాదని తాము నిర్ణయించినట్టు మోడీ ఆసియాన్ సమ్మిట్(Asian Summit)లో తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆర్‌సీఈపీ సమ్మిట్‌లో ప్రధాని
Attended the meeting on RCEP in Bangkok earlier today. pic.twitter.com/7e0AI3u1pQ
— Narendra Modi (@narendramodi) November 4, 2019
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు సమీపంలోని నాంతాబురిలో సోమవారం జరిగిన ఆర్‌సీఈపీ సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ....RCEP ఒప్పందం యొక్క ప్రస్తుత రూపం ప్రాథమిక స్ఫూర్తిని,అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను లేదా భారతదేశం యొక్క ఆందోళనను పూర్తిగా ప్రతిబింబించదని అన్నారు.
అటువంటి నిర్ణయాలలో వాటా ఉన్న దేశంలోని రైతులు, వ్యాపారులు, నిపుణులు,పరిశ్రమలు, కార్మికులు,వినియోగదారులను ఉటంకిస్తూ...నేను RCEP ఒప్పందాన్ని భారతీయులందరి ప్రయోజనాలకు సంబంధించి కొలిచినప్పుడు, నాకు సానుకూల సమాధానం లభించలేదు. అందువల్ల నామనస్సాక్షి నన్ను RCEP లో చేరడానికి అనుమతించలేదని మోడీ తెలిపారు.
కాగా- మోడీప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’కు గుడ్‌బై చెప్పిందని, ఇది కాస్తా ‘బై ఫ్రమ్ చైనా’ గా మార్చేసిందనీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అంతకుముందు వ్యాఖ్యానించారు. ‘‘ ఆర్‌సెప్ వల్ల వేల మంది ఉపాధి కోల్పోతారు. కారుచౌక వస్తువులు ఇబ్బడిముబ్బడిగా భారత మార్కెట్‌ను ముంచెత్తుతాయి. ఇప్పటికే సగటున ఒక్కో భారతీయుడు ఏటా రూ 6000 మేర చైనా వస్తువులు కొనేట్లు చేశారు.
2014 నుంచి చైనా దిగుమతులు వంద శాతం పెరిగాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇపుడు కాదన్నా రాబోయే రోజుల్లో మోదీ ప్రభుత్వం ఆర్‌సీఈపీలో భారత్‌ను చేర్చేసే ప్రమాదముందని కొన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఓ స్పష్టమైన హామీ నిమిత్తం పార్లమెంట్ లోపలా, బయటా కేంద్రాన్ని నిలదీయాలని ఆ నేతలు నిర్ణయించారు.
కాగా పదహారు ఆసియా, పసిఫిక్ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి ఏర్పాటవుతున్నది. ఇది ప్రపంచ జీడీపీలో 30 శాతం, ప్రపంచ జనాభాలో సగభాగం కలిగి ఉన్నది. ఆర్‌సీఈపీని ఆయుధంగా చేసుకుని భారత్‌లోకి చైనా చౌక ఉత్పత్తులను డంప్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సహా భారత్‌లోని పలు ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, చిన్న పరిశ్రమలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందంలో తగిన రక్షణలు కల్పించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
10 ఆసియాన్ దేశాలతో పాటు భారత్, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణకొరియా మధ్య ఆర్‌సీఈపీ ఒప్పందానికి సంబంధించి ఏడేండ్లుగా (2012 నుంచి) సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆర్‌సీఈపీలో భారత్ చేరితే, ఆసియాన్, జపాన్, దక్షిణకొరియాకు చెందిన 90 శాతానికిపైగా ఉత్పత్తులకు, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన 74 శాతానికిపైగా ఉత్పత్తులకు సుంకాలను తొలిగించాల్సి ఉంటుంది.
కాగా, ఇండియా లేకుండా ఆర్‌సీఈపీ ఒప్పందం ముందుకు వెళ్తుందా అనేది వేచిచూడాల్సి ఉంది. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఇదిలా ఉంటే అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సులోనే అది జరగాలని సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది.
బీజేపీ హర్షం
HM Amit Shah: India’s decision to not sign #RCEP is a result of PM's strong leadership & unflinching resolve to ensure national interest in all circumstances. It shall ensure support to our farmers, MSMEs, dairy & manufacturing sector, pharmaceutical, steel & chemical industries. pic.twitter.com/Ak5Y2Soq4k
— ANI (@ANI) November 4, 2019
ప్రాంతీయ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయరాదని భారత్ నిర్ణయించడంపై బీజేపీ హర్షం ప్రకటించింది. నరేంద్ర మోదీ బలమైన నేతృత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలే ఆయనకు పరమావధి అన్నది మరోసారి నిరూపితమైందని అన్నారు.