Karnataka Road Accident (Photo-X)

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) మరికొందరు కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గాణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి యాత్ర వెళ్లారు.

దేవాలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, హల్లిఖేడ్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఒక వ్యాను వేగంగా ఢీకొట్టింది.ఈ ఢీ దెబ్బకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. సంఘటనా స్థలంలోనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు వెంటనే ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

హల్లిఖేడ్ పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు యాత్రకు వెళ్లి తిరిగి మృతదేహాలుగా రావడంతో జగన్నాథ్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదానికి కారణం వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.