Delhi Air Pollution: అవసరమైతే మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్, వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టుకు ప్రమాణ పత్రం సమర్పించిన ఢిల్లీ ప్రభుత్వం
Delhi Air Pollution (Photo Credits: PTI/File Image)

New Delhi, November 15: ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్‌ (Ready to Impose Complete Lockdown)విధించడానికి సిద్ధమని అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై. చంద్ర చూడ్‌, జస్టిస్‌ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు.

ఈ సందర్భంగా కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి అందజేసింది. దీనిలో స్టోన్‌ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని సోలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. మరోపక్క అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం (Delhi Govt Tells Supreme Court) సమర్పించింది.

దీనిలో ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని పేర్కొంది. లాక్‌డౌన్‌ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది. ''స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. లాక్‌డౌన్‌ కచ్చితంగా ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌గానీ ఆదేశించాలని ప్రభుత్వం సమర్పించిన తన ప్రమాణ పత్రంలో పేర్కొంది.

తుఫాను ముప్పుతో ఈ నెల 18 దాకా భారీ వర్షాలు, అండమాన్ సముద్రంలో అల్పపీడనం, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి మరింత బలపడనున్న సైక్లోన్, నవంబరు 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశం

ఢిల్లీలో రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌ దిల్లీ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ రాహుల్‌ మెహ్రాను ప్రశ్నించారు. అయితే దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ''ఇలాంటి కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయం.. పాపులర్‌ స్లోగన్లపై ఎంత వెచ్చిస్తున్నారో ఆడిట్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌, హరియాణ,ఉత్తరప్రదేశ్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోర్టు కోరింది. విష‌పూరితంగా మారిన వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు, అధికారులు మంగ‌ళ‌వారం స‌మావేశ‌మై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.

ఈలోపు కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు రేపు భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొంది. కాగా ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వారం రోజులపాటు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. వాహనాలు తిరగడాన్ని నియంత్రించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ కార్యక్రమాలను సైతం నాలుగు రోజులపాటు నిలిపివేయాలని తెలిపింది.

రైలు ప్రయాణికులకు అలర్ట్, ప్రతి రోజూ ఆరుగంటల పాటు రిజర్వేషన్ సేవలు నిలిపివేత, వచ్చే వారం రోజుల పాటు రాత్రి 11:30 గంటల నుంచి తెల్లారి ఉదయం 5:30 గంటల వరకు సేవలు ఆపేస్తున్నట్లు ప్రకటించిన భారతీయ రైల్వే

వాయు కాలుష్యానికి దుమ్ము, భారీ వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే ప్రధాన కారణాలని సోమవారం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు కొంతకాలం పాటు మూసివేతకు అవకాశం ఉన్న పరిశ్రమలు, పవర్‌ప్లాంట్ల గురించి రెండు ప్రభుత్వాలు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వాహనాల కదలికలను సైతం నిలిపివేయాలని సూచించింది. పంట వ్యర్థాలు కాల్చడమే.. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో కాలుష్యానికి ప్రధాన కారణం కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడుతోందని తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వాయు కాలుష్యానికి రవాణా, పరిశ్రమలు, ట్రాఫిక్‌ అని.. తక్షణమే తగిన చర్యలు చేపడితే.. కాలుష్యాన్ని తగ్గించొచ్చని పేర్కొన్నారు. సందర్భంగా పరిశ్రమలు మూసివేయడమే కాకుండా వాహనాలను అడ్డుకోగలరా? అంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. మూసివేయగల పవర్‌ ప్లాంట్ల సమాచారాన్ని అందించాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాధానాలు ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు తాము ఆదేశాలివ్వడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది.

రేపటిలోగా నిర్మాణ పనులు, అనవసర రవాణా సేవలను నిలిపివేసేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమావేశానికి హాజరుకావాలంటూ పంజాబ్‌, యూపీ, ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.తదుపరి విచారణ నవంబర్‌ 17వ తేదీకి వాయిదా వేసింది.