Bhubaneswar, Jan 6: ఒడిశాలోని రైల్ సెయిల్‌లోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ (Rourkela Steel Plant Gas Leakage) సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుమంది మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్‌లోని (Rourkela Steel Plant) ఓ యూనిట్‌లో విషపూరిత గ్యాస్ లీకైనట్లు అధికారులు గుర్తించారు. బుధవారం ఉదయం కోల్ కెమికల్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ నుంచి విషపూరితమైన గాలి వ్యాపించింది. దాన్ని పీల్చిన ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్పృహ తప్పిపడిపోయిన వారిని ప్లాంట్ సమీపంలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌కు మరో నలుగురిని మార్చారు.
గ్యాస్ లీకైనట్లు వార్త వ్యాపించగానే.. ప్లాంట్‌కు చెందిన అగ్ని మాపక సిబ్బంది అక్కడకు వచ్చింది. కోల్ కెమికల్ సైట్‌లోని సేఫ్టీ వాల్వ్ సడన్‌గా పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదంపై ఆర్‌ఎస్‌పి అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వారు తెలిపారు.
గతేడాది వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో విషాదాన్ని నింపిన సంగతి విదితమే.. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించగా వేయి మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.