 
                                                                 New Delhi, April 27: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న అంశంపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ స్వలింగ సంపర్కుల వివాహా అంశం సుప్రీంకోర్టులో ఎటూ తేలడం లేదు. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.
స్వలింగ జంటలకు ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని స్పష్టం చేసింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, లేదా బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేగాక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత అంశంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగడమే కీలకమని అంగీకరిస్తున్నట్లు పేర్కొంది.సేమ్ సెక్స్ కపుల్స్‌కు వివాహ చట్టబద్దత కల్పించకుండా.. వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
పెళ్లి చేసుకునే హక్కును తమకు నిరాకరించడమంటే తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. తమ ప్రాథమిక హక్కులను నిరాకరించడం వల్ల తాము వివక్షకు, బహిష్కరణకు గురవుతున్నామన్నారు. స్వలింగ వివాహం చేసుకున్న జంటలకు వైవాహిక హోదాను ఇవ్వకుండానే ఈ అంశాల్లో కొన్నిటిని పరిష్కరించడమెలాగో చూడాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ మే 3న జరుగుతుంది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) బుధవారం మాట్లాడుతూ, స్వలింగ వివాహాలపై చర్చించవలసినది న్యాయస్థానం కాదని, పార్లమెంటేనని చెప్పారు. అయితే ఇది ప్రభుత్వం వర్సెస్ న్యాయ వ్యవస్థ సమస్యగా చేయాలని తాను కోరుకోవడం లేదన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌ను వ్యతిరేకించింది. స్వలింగ వివాహాలను భారత దేశ సంప్రదాయ కుటుంబాలతో పోల్చకూడదని తెలిపింది. భారత దేశ సంప్రదాయ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఉంటారని తెలిపింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
