New Delhi, Sep 5: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో విభేదిస్తూ, సమర్ధిస్తూ పలువురు నేతలు మాట్లాడుతుండటంతో వివాదం మరింతగా రగులుతోంది. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అయోధ్యకు చెందిన ఒక హిందూ ధర్మకర్త పరంధాస్ అచార్య (Paramhans Acharya).. ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి పోస్టర్‌ను ఖర్గంతో వధించి.. ఉదయనిధి తలను నరికిన వారికి రూ.10 కోట్లు రివార్డు కూడా ప్రకటించారు. ఆ పని ఎవరూ చేయలేకపోతే.. తానే చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను ఆయన మళ్లీ సమర్ధించుకున్నారు. పది కోట్లు చాలకుంటే.. రివార్డును పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ తల నరకడానికి 10 కోట్లు సరిపోవనుకుంటే, అప్పుడు ఆ రివార్డును పెంచనున్నట్లు పరమహంస ఆచార్య వెల్లడించారు. కానీ సనాతన ధర్మంపై పట్ల అవమానాన్ని సహించబోనన్నారు.
ఈ దేశంలో జరిగిన అభివృద్ధికి సనాతన ధర్మమే కారణమన్నారు. ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలన్నారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజల మనోభావాలను ఆయన కించపరిచినట్లు ఆచార్య తెలిపారు.
స్వామీజీ వ్యాఖ్యలపై ఉదయనిధి తాజాగా స్పందించారు. తన తల కోసం రూ.10 కోట్లు అవసరం లేదన్నారు. తన తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల కోసం జీవితాన్నే పణంగా పెట్టిన కరుణానిధి మనవడిని అని పేర్కొన్నారు. ‘ఒక స్వామి నా తలపై రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించాడు. ఉదయనిధి తల నరికిన వారికి రూ. 10 ఇస్తానని చెప్పాడు. ఆయన కోటీశ్వరుడు. అతను నిజమైన పుణ్యాత్ముడా లేక డూప్లికేటేనా..? స్వామీజీ అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు?’ అని ఉదయనిధి ప్రశ్నించారు.
ప్రియాంక్ ఖర్గే, బీఎల్ సంతోష్ ట్విట్టర్ వార్
సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నడుమ ట్వీట్ల యుద్ధం చెలరేగింది.వేలాది సంవత్సరాలుగా ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని, అవి మనుషుల మధ్య వివక్షను పెంచుతూ మనిషిగా వారికి గౌరవాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ప్రియాంక్ ఖర్గే ట్విట్టర పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్పందిస్తూ ఒకరి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే మీరు తల నరికేస్తారా..?? అని ప్రశ్నించారు.
ఈ ట్వీట్‌పై రియాక్టయిన ప్రియాంక్ ఖర్గే మనలో నయం చేయాల్సిన ఇన్ఫెక్షన్ ఉందని బీఎల్ సంతోష్ గుర్తించడం సంతోషకరమని, వేల సంవత్సరాల నాటి ఇన్ఫెక్షన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. నేను మీ అంత తెలివైన వాడిని కాదని, తాను లేవనెత్తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తనలో చైతన్యం నింపాలని ఖర్గే పేర్కొన్నారు. సమాజంలో ఈ నియమాలను ఎవరు రూపొందించారు..? ఇతరుల కంటే మరొకరు సరైన వారని ఎలా చెబుతారు..? మనల్ని కులాల వారీగా ఎవరు విడదీశారు? కొందరు ప్రజలను ఎందుకు అంటరానివారిగా పరిగణిస్తారు? ఇప్పటికీ వారిని ఆలయాల్లోకి ఎందుకు రానీయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రియాంక్ ఖర్గే నిలదీశారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘సనాతన ధర్మం’పై గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పాత ట్వీట్ లో తన తల్లి సురేఖ ఇంట్లోని తులసి కోట వద్ద పూజ చేస్తూ కనిపించారు. ఈ ఫొటో షేర్ చేసిన చరణ్.. ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత’ అని పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ 11 నాటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..
తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ..సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమన్నారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. దీనిని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. పూర్తిగా రూపుమాపాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని అసోసియేషన్ నిర్ణయించటాన్ని ఆయన సమర్థించారు.
సనాతన భావజాలంలో భాగంగానే కేంద్రం ‘నీట్’ను తీసుకొచ్చిందన్నారు. ‘సనాతనం అన్నది సంస్కృత పదం. సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకం తప్ప మరోటి కాదు. కులం పేరుతో మనుషుల్ని విడదీసింది’ అని ఆయన విమర్శించారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ నాయకుడు, దివంగత నేత కరుణానిధి ద్రవిడ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కచోటకు తీసుకొచ్చారని వివరించారు.