New Delhi, May 28: భారత వాతావరణ శాఖ చల్లని కబురును అందించింది. భారత్ లో నైరుతి రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని, ఈ క్రమంలో ఈ ఏడాది రుతుపవనాలు మే 31నే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
రెండు వారాల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో తౌక్టే తుఫాను మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అనే రెండు తుఫానులు కారణంగా ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి.
మరోవైపు, నైరుతి వైపుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో మాల్దీవులు-కొమొరిన్ ప్రాంతంలో రుతుపవనాలు అభివృద్ధి చెందాయి. ఇవి సరైన దిశలో చురుకుగా కదులుతున్నాయి. మే 27 నాటికి ఈ పవనాలు ముందుకు వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నైరుతి రుతుపవనాలు మే 31న ఇండియాలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
సాధారణంగా రుతుపవనాలు ప్రతీ ఏడాది తేదీ జూన్ 1న కేరళ నుంచి దేశంలో ప్రవేశిస్తాయి. అలా జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు రుతు పవనాల ప్రసరణ దేశంలో కొనసాగుతుంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనావేసింది.
ఇదిలా ఉంటే, యాస్ తుఫాను బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం జార్ఖండ్ వద్ద కేంద్రీకృతమై అక్కడ్నించి బంగాళాఖాతం వైపుగా మరింత బలహీనపడుతుందని తెలిపింది. అయితే వాయువ్య బంగాళాఖాతం నుంచి వీచే గాలులు, నైరుతి రుతు పవనాల ఆగమన వాతావరణంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శనివారం, ఆదివారం, సోమవారాల్లో తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.