Hyderabad, January 20: హైదరాబాద్ నగరంలో 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆవిష్కరించనున్నారు. కాగా కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో ఎత్తైన విగ్రహం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా (Statue of Equality) రామానుజాచార్య విగ్రహంతో హైదరాబాద్ మెడలో మరో మణిహారాన్ని పొదుగుతున్నారు. మొత్తం 12రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు. ఈ యాగం కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. 5వేలమంది రుత్వికులు ఈ మహా క్రతువులో పాల్గొంటున్నారు.
120 ఏళ్ల పాటు జీవించిన భగవత్ రామానుజాచార్య (Saint Ramanujacharya) దేశమంతా విస్తృతంగా పర్యటించారు. కులవర్గ తారతమ్యాలు లేకుండా భక్తులందరూ భగవంతుడిని పూజించుకునేందుకు రామానుజాచార్యులు ఎనలేని కృషి చేశారు. అందుకే ఆయన పేరిట సమతా మూర్తి విగ్రహాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఏర్పాటు చేస్తున్నారు. 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహానికి అభిషేకం నిర్వహించడం కష్టతరం కాబట్టి ప్రత్యేకంగా బంగారంతో రూపొందించిన రామానుజచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. 120 కేజీల బంగారంతో దీనిని తీర్చిదిద్దారు. ఈ స్ఫూర్తి కేంద్రంతో హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు రాబోతోంది.
216 అడుగులతో కొలువుదీరిన సమతామూర్తిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో రామానుజాచార్యుల విగ్రహాన్ని108 ఫీట్ల ఎత్తులో రూపొందించారు. భద్రవేది ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, త్రిదండం 135 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. మొత్తం 200 ఎకరాల్లో సమతాస్ఫూర్తి కేంద్రం కొలువుతీరింది. భద్రవేదిలో మొత్తం 54 పద్మాలు నిర్మించారు. స్టాట్చ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పద్మం కింద 36 ఏనుగులు ఏర్పాటు చేశారు. 18 శంఖులు, 18 చక్రాలు తీర్చిదిద్దారు.
ముచ్చింతల్ ఆశ్రమంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత పరుచుకుంది. రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం, ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్ థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఇక భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులు ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు చిన్నజీయర్ స్వామి అతిరథ మహారథుల్ని ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సహా పలువురు ప్రముఖుల్ని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. వారికి సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను వివరించారు. రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. చిన్నజీయర్ స్వామితో పాటు.. మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని కలిసి ప్రాజెక్టు విశేషాల్ని తెలియజేస్తున్నారు.