Covid Second Wave: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, 10 రాష్ట్రాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన కేంద్రం
Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, Nov 28: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ మూడవదశలోకి (Covid Third Wave) ప్రవేశించింది. భారత్ లో కూడా సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి, ఇప్పటికే ఢిల్లీ సెకండ్ వేవ్ దాటి మూడవ దశలోకి (Delhi Coronavirus) ప్రవేశించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల బెంచ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించింది. కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30శాతం మంది గడ్డం కిందకి మాస్కుల్ని వేలాడదీస్తున్నారు. గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని కఠినతరం చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా..? 5 మందికి మాత్రమే అనుమతిచ్చినట్లుగా వార్తలు, కరోనా వ్యాక్సిన్ పురోగతిపై మూడు నగరాల్లో ప్రధాని పర్యటన

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పది రాష్ట్రాల నుంచి 77% కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయంటూ ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని బెంచ్‌ స్పష్టం చేసింది.