A file photo of activist Varavara Rao | PTI

New Delhi, August 10: భీమా కోరేగావ్‌‌ కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో (Supreme Court ) ఊరట లభించింది.సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను (grants regular bail)మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వరవరరావు (Varavara Rao)దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్‌, అనిరుద్ధ బోస్‌, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా వరవరరావు ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్‌ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. బెయిల్ ఇస్తూ.. ముంబైలోని ఎన్‌ఐఏ కోర్ట్‌ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.

హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులపై తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసిన ఐబీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ

భీమా కోరెగావ్‌ కేసులో ఆగస్ట్‌ 28, 2018న వరవరరావును అరెస్టు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో ముంబయిలోని తలోజా జైలుకు తరలించారు. 2020లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిబ్రవరి 2021లో హైకోర్టు ఆయనకు ఆరు నెలల మెడికల్‌ బెయిల్‌ను మంజూరు చేస్తూ.. శాశ్వత బెయిల్‌కు నిరాకరించింది. ఆ తర్వాత మెడికల్‌ బెయిల్‌ను తాత్కాలికంగా మూడు నెలలు పొడిగించింది. మూడు నెలల తర్వాత జైలులో లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.