New Delhi, Nov 17: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్, సునిల్ కుమార్ సింగ్‌తో పాటు ఎన్జీవో యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు ఈ పిటిషన్ వేశారు. అయితే ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ జస్టిస్ యూ.యూ. లలిత్ (Supreme Court Justice UU Lalit) తెలిపారు. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కేసులను కొన్ని వాదించానని, దాని మూలంగానే ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ లలిత్ వెల్లడించారు.
జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ వినీత్ శరన్, రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం వైఎస్ జగన్ కేసును విచారించాల్సి ఉన్నది. కానీ లలిత్ తప్పుకోవడంతో.. ఇప్పుడు ఈ కేసును మరో బెంచ్‌కు రిఫర్ చేయాల్సి ఉంటుంది. కాగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై సీఎం వైఎస్ జగన్ (Justice N V Ramana) అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాదులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. జస్టిస్ రమణపై జగన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవి నిరాధారమైనవని, వైఎస్ జగన్‌పై 20 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ న్యాయవాదుల బృందం సుప్రీంలో కేసు దాఖలు చేసింది.
అయితే ఇవాళ బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో.. ఈ కేసును మరో ధర్మాసనానికి ఇవ్వాలంటూ సీజేఐ ఎస్ బోబ్డేను (Chief Justice of India (CJI) S A Bobde) కోరారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల తీరును ఖండిస్తూ సీజేఐకి సీఎం జగన్ ఇటీవల ఓ లేఖ రాశారు. దీన్ని ఖండిస్తూ న్యాయవాదులు సుప్రీంలో వైఎస్ జగన్‌పై పిటిషన్ దాఖలు చేశారు. జగన్, ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లమ్‌పై కోర్టు ధిక్కరణ కింద విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఏపీ న్యాయవాదులు కోరారు. కానీ అటార్నీ వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.