New Delhi, April 20: ఉత్తరప్రదేశ్ లోని అయిదు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే (Supreme Court Stays Allahabad HC Order ) విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యూపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం ఈ అంశంలో అమికస్ క్యూరీని నియమించింది. కాగా ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో ఏప్రిల్ 28వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు నిన్న తన ఆదేశాలు పేర్కొన్నది.
ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తేనే, వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉన్నట్లు ఆ తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. అయితే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన సుప్రీం.. అలహాబాద్ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు జస్టిస్ ఏఎస్ బొప్పన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వం అప్పీల్‌ను విచారించింది. అయితే మహమ్మారి నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను హైకోర్టుకు విన్నవించాలని సుప్రీం ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్‌గా పీఎస్ నరసింహను అమికస్ క్యూరీగా నియమించారు.
న్యాయపరమైన ఆదేశాల ద్వారా లాక్‌డౌన్ విధించడం సరైన విధానం కాదు అని యూపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో సుప్రీంకు చెప్పింది. 5 నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో తీవ్ర పరిపాలనా సమస్యలను సృష్టిస్తాయని యూపీ ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది.
ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి వారం శని, ఆదివారాలతో వీకెండ్ లాక్‌డౌన్ (UP Lockdown) విధించనున్నట్లు ప్రకటించింది. ముందుగా రాబోయే శని, ఆదివారాలతో వీకెండ్ లాక్‌డౌన్‌ను ప్రారంభించనున్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ అవానిస్ కే అవస్థి తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో కేవలం అత్యావసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కె అవాస్తి తెలిపారు.