Chennai, May 29: తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఓ 18 నెలల చిన్నారి పాము కాటుకు బలైంది. అయితే అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో, సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లాకు చెందిన ఓ 18 నెలల అమ్మాయి పాము కాటుకు గురైంది.
వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారి ధనుష్కను వేలూరులోని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.అయితే అంబులెన్స్ కొంత దూరం వెళ్లిన తర్వాత.. అక్కడ రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు కదల్లేకపోయింది. దీంతో తల్లి అంబులెన్స్ దిగి తన భుజాలపై కూతుర్ని ఆరు కిలోమీటర్ల మేర మోసుకెళ్లింది.
ఈ క్రమంలో మార్గమధ్యలోనే ధనుష్క ప్రాణాలు కోల్పోయింది. సరైన రోడ్డుమార్గం లేకపోవడం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై వేలూరు జిల్లా కలెక్టర్ స్పందించారు. ధనుష్క తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆశా వర్కర్‌ను సంప్రదిస్తే, ప్రథమ చికిత్స చేసేవారు. దాంతో పాప ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉండేదన్నారు. కానీ తల్లిదండ్రులు ఆశా వర్కర్‌ను సంప్రదించలేదని తెలిపారు. ఇక ఈ మార్గంలో రోడ్డు పనులకు ఆమోదం లభించిందని, నిధులు కూడా మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు