Chennai, May 30: తమిళనాడు రాష్ట్రంలో సడలింపులు లేని కఠిన లాక్‌డౌన్ (Tamil Nadu Lockdown Extended) జూన్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. కఠిన లాక్‌డౌన్‌లో ఈసారి కాయగూరలతో పాటు, కిరాణా సరుకులను కూడా వాహనాల్లో విక్రయించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తుల నివారణ చట్టం ప్రకారం గతేడాది మార్చి 25 నుంచి రాష్ట్రంలో కఠిన, సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న జరిగిన అఖిలపక్ష సభ్యుల సలహా కమిటీ, వైద్య నిపుణల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఈ నెల 24 నుంచి కఠిన లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఏర్పడిందని స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్ ఈ నెల 31 ఉదయం ఆరుగంటలకు ముగియనుండగా జిల్లాల వారీగా వైరస్ వ్యాప్తిని, కరోనా బాధితుల సంఖ్యను పరిశీలించిన మీదట కఠిన లాక్‌డౌన్‌ను జూన్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తు న్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖ ఆధ్వర్యంలో వాహనాల్లో కాయగూరల విక్రయాలను కొనసాగిస్తున్నామని, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థల అధికారుల అనుమతితో ఆయా ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల ద్వారా వాహనాల్లో, తోపుడు బండ్లలో కిరాణా సరకులను రోజూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు విక్రయిస్తారని సీఎం పేర్కొన్నారు. జూన్ నుంచి 13 రకాల కిరాణా సరుకులతో బియ్యం రేషన్ కార్డుదారులందరికీ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్ జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను సీనియర్ ఐఏఎస్ అధికారులు ముగ్గురుని ప్రత్యేక అధికారులుగా సీఎం స్టాలిన్ నియమించారు. కోయంబత్తూరు జిల్లాకు వాణిజ్యపన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఏ. సిద్ధిఖ్, తిరుప్పూరుకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి. సమయమూర్తి, ఈరోడ్ జిల్లాకు సర్వే, భూమిపన్నుల పథకం అమలు కమిషనర్ డాక్టట్ ఆర్.సెల్వరాజ్ నియమితులయ్యారు.
ఈ ముగ్గురు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్థానిక అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా మూడు జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలను అధికం చేయడం, కంటైన్‌మెంట్‌జోన్లలో వైరస్ వ్యాప్తిని అధికం కాకుండా అడ్డుకట్టవేయడం తదితర చర్యలు తీసుకోనున్నారు.