CM KCR on Pranab's Statesmanship: ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి, రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్న తెలంగాణ సీఎం
File image of CM KCR with the former president Pranab Mukherjee | File Photo

Hyderabad, September 1:  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సీఎం తెలిపారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్ కు) దక్కిందని అని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ (The Coalition Years) పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని తెలియజేశారు. దీన్ని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు.

ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.