Telangana: గోల్కోండ కోటపై ఎగిరిన జాతీయ జెండా. తెలంగాణలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.
Telangana CM KCR addressing people on 73rd Independence Day | Photo Credits : TS CMO

భారత 73 స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, గోల్కోండ ఖిల్లాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

తెలంగాణ ఎకానమీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్దిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తిలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో 4 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉంటే, నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని సీఎం చెప్పారు. వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం, క్రమశిక్షణ, అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

పేదలకు సంక్షేమం.

పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం. కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం. దీర్ఘకాలికంగా తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సాధించుకోగలిగాం. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించగలిగాం. ప్రజలు కనీస జీవన భద్రతతో జీవించే దశకు తీసుకురాగలిగాం. మన రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో గడిచిన ఐదేళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది.

పాలనాపరమైన సంస్కరణలు:

గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, నేడు తెలంగాణలో 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,751 కు పెంచాం. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇవాళ మొదటి సారిగా గ్రామ పంచాయతీలుగా మారిన తమ పల్లెలు, తండాలు, గూడాల్లో సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది.

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాలు

ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.

పాత చట్టాలకు ప్రక్షాళన

పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుంది. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడం కోసం పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఆ విధంగానే నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది.

ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నది.

రాష్ట్రంలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ

కొత్త చట్టాల అమలుకు శ్రీకారం చుడుతూ నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడం కోసం గ్రామాలలో, పట్టణాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ 60 రోజుల ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చబోతున్నారు.

పవర్ వీక్

60 రోజుల ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు విద్యుత్ శాఖ, ప్రజల భాగస్వామ్యంతో 'పవర్ వీక్' నిర్వహించుకోవాలి. వంగిన కంభాలను సరిచేయాలి. తుప్పు పట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోళ్లు వేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. అన్ని గ్రామాలకు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. విద్యుత్ శాఖ సిబ్బంది వారం రోజుల పాటు గ్రామాల్లో, డివిజన్లలోనే అందుబాటులో ఉంటారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమం

పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణం మాత్రమే జీవితాన్ని సుఖప్రదం చేస్తాయి. వత్తిడిని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతాయి. రాబోయే తరానికి ఆస్తుపాస్తులిస్తే సరిపోదు. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన నిజమైన కర్తవ్యం కావాలి.

60 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం తమకు అవసరమైన నర్సరీలను స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను ఖచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామ బడ్జెట్ లో 10 శాతం నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే ఆరు మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి పెంచి, పెద్ద చేసే ప్రేరణ కలిగించాలి. మొక్కలను నాటే విషయంలో, కాపాడే విషయంలో ఎలాంటి అజాగ్రత్త, అలసత్వానికి తావివ్వొద్దు.

57 సంవత్సరాలకే ఫించన్

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3016 రూపాయలు, ఇతరులకు 2016 రూపాయల పెన్షన్ అందించుకుంటున్నాం. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

తెలంగాణ వ్యవసాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శం అయింది. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో మన రైతుబంధు, రైతు బీమా పథకాలను పేర్కొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి మన రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది. మన రాష్ట్రానికి ప్రశంసలు అందించింది. ఇది మన రాష్ట్ర రైతు లోకానికి, మనందరికీ గర్వకారణం.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా 575 టిఎంసిలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టిఎంసిల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ట్రానికి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరివ్వడానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టిఎంసిలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరివ్వడానికి దేవాదుల ద్వారా 75 టిఎంసిల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలు కలుగుతుంది. శరవేగంగా నిర్మాణమవుతున్న ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం ఇప్పుడున్న గోదావరి ప్రాజెక్టులకు అదనంగా 575 టిఎంసిల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతున్నదనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.