Hyderabad, June 27: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పైపైకి పోతున్నాయి. అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారీస్థాయిలో 985 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 12,349 కు చేరుకుంది.
ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. శుక్రవారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 774 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్ నుంచే 9 వేలకు పైగా కోవిడ్ కేసులున్నాయి, అలాగే నగరానికి సమీపంలో ఉండే జిల్లాల్లోనే మరో 2 వేల వరకు కేసులు నమోదయ్యాయి.
నిన్నమరోసారి రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్ నుంచి 53 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలోనే అత్యధికంగా శుక్రవారం 20 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Update:
నిన్న మరో 7 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 237 కు పెరిగింది.
ఇదిలా ఉంటే, ఈరోజు మరో 78 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,766 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,436 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 4,374 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,308 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో కేసులు పెరుగుతూ పోతున్న క్రమంలో మరోసారి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక బృదం ఈరోజు తెలంగాణలో పర్యటించనుంది. హైదరాబాద్ లో వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ వ్యాప్తి గల కారణాలు, పరిస్థితులను ఈ బృందం మరోసారి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది.