TSRTC Strike Updates: రోజుకో మలుపు తిరుగుతున్న ఆర్టీసీ సమ్మె, ఉద్యోగాలు తీసే అధికారం ఎవరికీ లేదన్న ఆర్టీసీ జేఏసీ, మంత్రి హరీష్ రావుకు సమ్మె సెగ, నేడు ఆర్టీసీ..రేపు సింగరేణి అంటున్న భట్టీ విక్రమార్క, నేలరాలిన మరో కార్మిక కిరణం
telangana-rtc-jac-held-meeting-in-tmu-office-and-announces-schedule-of-strike

Hyderabad, November 3: తెలంగాణ(Telangana)లో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె (TSRTC Strike) ఆదివారం నాటికి 30వ రోజుకు చేరుకుంది. కాగా, సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (K. Chandrashekar Rao) చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (telangana-rtc-jac) తీవ్రంగా మండిపడింది. తొలుత కార్మికుల డిమాండ్లపై చర్చించి దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను ఎలా సమకూరుస్తారో చెప్పాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. సమ్మెపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో టీఎంయూ కార్యాలయంలో జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లకు అంగీకరిస్తే యూనియన్లే ఉండవని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ కార్మికులు మా కుటుంబసభ్యులు’ అన్నందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. కార్మికులంతా ధైర్యంగా ఉండాలని, ఆత్మగౌరవాన్ని చంపుకొని తిరిగి ఉద్యోగాల్లో చేరొద్దని పిలుపునిచ్చారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా ఉద్యోగంలో తిరిగి చేరాలని గతంలోనూ సీఎం చెప్పినా కార్మికులు చేరలేదని, ఇప్పుడు కూడా చేరబోరని అన్నారు.

నవంబర్ 5లోగా సమ్మెను విరమించాలని కేసీఆర్ డెడ్‌లైన్

కాగా ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా సమ్మెను విరమించాలని కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఆలోగా విధుల్లో చేరే కార్మికులకే ఉద్యోగాలు ఉంటాయన్నారు. లేదంటే ఆర్టీసీ మొత్తాన్ని ప్రయివేట్ పరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రతిపక్షాలే కారణమని ఆయన ఆరోపించారు.

 ఉద్యోగాలు తీసే అధికారం ఎవరికి లేదు: అశ్వత్థామరెడ్డి

దీనిపై ఆర్టీసీ జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉద్యోగాలు తీసే అధికారం ఎవరికి ఉండదని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె ఉపసంహరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే, ఏదైనా కమిటీ వేసి సమస్య పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటేనే సాధ్యమని అన్నారు. తమ డిమాండ్లపై సీఎం కేసీఆర్‌ మొండి వైఖరికి నిరసనగా సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సమ్మె మరింతగా ముందుకు

సోమవారం అన్ని డిపోల దగ్గర విపక్ష నేతలతో కలిసి ధర్నాలు చేపట్టనున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, జనసేన, వామపక్షాలు పాల్గొంటాయి. నవంబరు 5న సడక్‌ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధం, 6న కుటుంబ సభ్యులతో కలిసి డిపోల వద్ద నిరసన తెలియజేయనున్నారు. నవంబరు 7న అన్ని ప్రజా సంఘాలతో నిరసన ప్రదర్శనలు, 8న చలో ట్యాంక్‌బండ్‌ సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించి, 9న చలో ట్యాంక్‌బండ్‌, రెండు గంటలపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఆర్థిక మంత్రి హరీష్‌ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ

ఆర్థిక మంత్రి హరీష్‌ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. బీరంగూడలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. అయితే, ఆయన్ను అడ్డుకునేందుకు ఆర్టీసీ యూనియన్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహెచ్‌ఈఎల్ డిపో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, మంత్రి హరీష్ రావును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కాగా ఆర్టీసీ సెగ తగలడం మంత్రి హరీష్‌కు ఇది తొలిసారి.

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి: మంత్రి గంగుల కమలాకర్

ప్రతిపక్షాల వల్ల ఆర్టీసీ కార్మికులకు మేలు ఏమీ జరగదని, పార్టీల జెండాలతో వచ్చి వారు ఏమీ చేయలేరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డ్రైవర్ బాబు అంతిమయాత్రలో రాజకీయ నాయకులు చేసిన డ్రామానే దీనికి నిదర్శనమన్నారు. కరీంనగర్ లో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంత పెద్ద నాయకులు డ్రైవర్ బాబు కుటుంబానికి కనీసం అంత్యక్రియలకు కూడా ఆర్థిక సహాయం అందించలేదని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కార్మికులందరూ డ్యూటీ లో చేరాలని కోరారు.

ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణి : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానన్న సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలన చేయలేక రాష్ట్రాన్ని దివాలా తీయించి, ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేసేలా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉందని భట్టి అన్నారు. ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణి ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేలా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ.. సర్కారు తీరుతోనే ఆరేండ్లలో దివాలా తీసిందని అన్నారు. ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదని, దశాబ్దాల కష్టంతో వచ్చిన ఆస్తి అని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని ప్రశ్నించారు.

చికిత్స పొందుతూ మరో ఆర్టీసీ కార్మికుడు కన్నుమూత

ఆర్టీసీ సమ్మెలో మరో ఆర్టీసీ కార్మికుడు కన్నుమూశాడు. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కండక్టర్ రవీందర్ కు మొన్న గుండెపోటు వచ్చింది. సమ్మె నేపథ్యంలో ఎదురైన విపరీత ఒత్తిడులతో రవీందర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. చికిత్స పొందుతూ ఈ అర్థరాత్రి తర్వాత కన్నుమూశారు. రవీందర్ మృతదేహాన్ని తెల్లవారుజామున ఆత్మకూరుకు తరలించారు పోలీసులు. రవీందర్ ఇంటికి కార్మికులంతా చేరుకోవాలని జేఏసీ పిలుపునివ్వడంతో ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు.

విధులకు హాజరవుతున్న కొందరు కార్మికులు

ఆర్టీసీ కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో కార్మికులు ఒక్కొక్కరిగా విధులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల మాయలో పడొద్దని.. కార్మికులకు రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీతో కామారెడ్డి డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ హైమత్ ఈ రోజు విధుల్లో చేరాడు. డిపోకు వచ్చిన ఆయన పై అధికారులకు తాను విధులకు హాజరు అవుతానని చెప్పడంతో, వెంటనే అతడ్ని విధుల్లోకి తీసుకున్నారు. కాగా, ఆయన తీసుకున్న నిర్ణయంతో అసాంఘిక శక్తులు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు.. ఒక ప్రకటన జారీ చేశారు. విధుల్లో చేరి, ఉద్యోగం చేరాలని భావిస్తున్న కార్మికులు ముందుకు రావాలని, వారికి రక్షణ కల్పించే బాధ్యత తమదేనని వెల్లడించారు.