Telugu Doctors Missing In Delhi: ఢిల్లీలో మిస్సింగ్ కలకలం, ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం, 6 రోజులైనా దొరకని ఆచూకి, పోలీసులకు కంప్లయింట్ చేసిన సమీప బంధువు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకా క్లూ కూడా చిక్కని వైనం
Two Telugu Doctors Missing In Delhi Since Christmas Eve, Case Filed (photo-Getty)

New Delhi, December 31: ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం(Telugu Doctors Missing) కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ జిల్లా (YSR Kadapa) ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా (Ananthapuram) హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య డిసెంబర్‌ 25 నుంచి కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్‌ పోలీస్‌స్టేషన్‌లో (Hauz Khas police station) ఫిర్యాదు చేశాడు. 6 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. కేసును స్వీకరించిన పోలీసులు వారిని వెతికే పనిలో పడ్డారు.

వివరాల్లోకెళితే.. హిమబిందు, దిలీప్, శ్రీధర్ ముగ్గురు 2007లో ఎంబీబీఎస్‌లో క్లాస్‌మేట్స్‌. వీరిలో హిమబిందు, శ్రీధర్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్లిని దిలీప్ దగ్గరుండి జరిపించాడు.

ప్రస్తుతం శ్రీధర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ (Aims IN Delhi) ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఎయిమ్స్‌లో పీజీ చేసిన హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలోనే ఒక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక దిలీప్‌ సత్య చండీగఢ్‌లో పీజీ చేశాడు. అక్కడే సీనియర్‌ రెసిడెన్సీగా చేసి, 2 నెలల క్రితం మానేశాడు. ఉన్నత చదువులకు సన్నద్ధమవుతున్నాడు. ఈ మధ్యనే డీఎం పరీక్ష రాశాడు.

సోమవారం రాత్రి శ్రీధర్‌ ఏపీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ. ‘‘జిప్‌మర్‌ కౌన్సెలింగ్‌ కోసం దిలీప్‌ చెన్నై వెళ్లి 25వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు చండీగఢ్‌ వెళ్లే ట్రైన్‌ ఉందని, ఇంటికొస్తానని నాకు ఫోన్‌చేసి చెప్పాడు. నేను ఉదయం 7.30 గంటలకే డ్యూటీకి వెళ్లాను. ఢిల్లీ వచ్చిన దిలీప్‌ ఉదయం 8.45–9.00 గంటల మధ్య మా ఇంటికి చేరినట్టు ఫోన్‌ చేశాడు. క్రిస్మస్‌ సెలవు కావడంతో నా భార్య ఇంట్లోనే ఉంది. వారిద్దరూ అల్పాహారం తీసుకున్నారు.

ఆ తర్వాత ఉదయం 11.20 గంటలకు నా భార్య ఫోన్‌ చేసింది. చర్చికి వెళుతున్నామంది. దిలీప్‌తో కలిసి వెళ్తానని, అతడు అటునుంచి అటే రైల్వే స్టేషన్‌కు వెళతాడని చెప్పింది. నా డ్యూటీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్‌ చేస్తే నా భార్య ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. వెంటనే దిలీప్‌కు ఫోన్‌ చేశాను. అతడి ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. సాయంత్రం వరకూ చాలాసార్లు చేశా. స్విచ్ఛాప్‌ అనే సమాధానం వచ్చింది. సాయం త్రం 6 గంటలకు దిలీప్‌ భార్య దివ్యకు ఫోన్‌ చేశా. ఆమె చండీగఢ్‌లోనే జాబ్‌ చేస్తోంది. దివ్య ఫోన్‌ చేసి నా స్విచ్ఛాప్‌ అని వస్తున్నట్లు చెప్పింది. కాగా దిలీప్‌ ఉదయం ఫోన్‌ చేసి చర్చికి వెళుతున్నట్టు చెప్పాడంది. దిలీప్‌ చండీగఢ్‌కు చేరుకోకపోవడంతో దివ్య అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చేసింది’’అని శ్రీధర్‌ తెలిపాడు.

ఇదిలా ఉంటే దిలీప్, హిమబిందు అదృశ్యంపై ఇప్పటిదాకా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇద్దరూ ఎక్కడికెళ్లారో తెలియడం లేదు. వాళ్ల బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూశాం. డిసెంబర్‌ 21 తర్వాత వాళ్లు ఏ కార్డు వాడలేదు. చేతిలో 3, 4 వేల కంటే నగదు లేదు.

హిమబిందు భర్త మాట్లాడుతూ.. మీడియాలో ఏవేవో రాస్తుంటారని అలాంటవి దయచేసి రాయవద్దని కోరారు. దిలీప్ నా భార్యకు అన్నలాంటి వాడని,దిలీప్‌ తల్లిదండ్రులు నా భార్యను కూతురిలా చూసుకుంటారని తెలిపారు ఈ ఘటనను దయచేసి మీడియా తప్పుగా చూపించొద్దని వేడుకున్నాడు.