New Delhi, July 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న కేంద్ర మంత్రివర్గ సమావేశం (PM Modi to chair meeting with Council of Ministers) నిర్వహించబోతున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రులతో గురువారం మోదీ సమావేశాలు నిర్వహించారు. కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Union Cabinet Reshuffle) అనంతరం జరిగే రెండో భేటీ ఇది. కేంద్ర మంత్రివర్గం విస్తరించిన ఒక రోజు తరువాత, ప్రధాని గురువారం కేంద్ర మంత్రివర్గం (Union Cabinet 2.0) మరియు మంత్రుల మండలితో సమావేశాలు జరిపారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్-19పై పోరాటంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదని మంత్రులను మోదీ ఆదేశించారు. ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ప్రజలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా తిరుగుతున్నారన్నారు. ఈ పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు.
దేశవ్యాప్తంగా ఏర్పాటుకానున్న 1,500 లకు పైగా పీఎస్‌ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సోర్ప్సన్) ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని కోవిడ్ సమీక్షలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కూడా సూచించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు పీఎం కేర్స్ ఫండ్, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నిర్మితమవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పీఎం కేర్స్ ఫండ్ సహకారం అందించే పీఎఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తు న్నాయని, ఇవి పనిచేయడం ప్రారంభించాక 4 లక్షలకు పైగా ఆక్సిజన్ లభ్యత ఉన్న పడకలు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు.
ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. నిపుణులు తయారుచేసిన శిక్షణా మాడ్యూల్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మందికి శిక్షణ ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రధానికి అధికారులు తెలియజేశారు. స్థానిక, జాతీయ స్థాయిలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, పనితీరు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)æ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రధానమంత్రి సూచించారు.