New Delhi, June 8: దాదాపు ఎనభై రోజుల తర్వాత దేశంలో చాలా చోట్ల రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్ (Malls, Restaurants) తెరుచుకున్నాయి. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూనే ప్రారంభమయ్యే కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల (Unlock 1.0 guidelines) ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఒకటి రెండు పరిమితులు తప్ప నేటి నుంచి దేశంలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
మార్చి 23న లాక్‌డౌన్‌తో (Coronavirus lockdown) మొదలైన ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. జూన్ 8 సోమవారం నుంచి దేవాలయాలు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు (Religious Places) , మాల్స్, హోటళ్లకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. వీటన్నిటిచోటా అందరూ మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. దీంతో సినిమా థియేటర్లు, బార్లు, కళా ప్రదర్శనలు, ఆటలు, బహిరంగ సభలు వంటివి తప్ప మిగిలినవన్నీ ప్రారంభం కానున్నాయి. దీనికి అనుగుణంగా గత వారం రోజుల నుంచి లాడ్జిలు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్ తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో అనుమతించేవి
తెలంగాణలో చాలా చోట్ల రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్ తెరుచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు అమలుచేస్తున్నామని, అక్కడ కార్యకలాపాలకు అనుమతి లేదని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటైన్మెంట్ ఏరియాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు అనుమతిస్తున్నట్టు తెలిపారు.
కాగా షాపింగ్ మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌కు, గేమింగ్ సెంటర్లు, సినిమాహాల్స్‌కు అనుమతిలేదని స్పష్టంచేశారు. మార్గదర్శకాలను అన్ని సంస్థల యజమాన్యాలు, నిర్వాహకులు పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్స్ (ఎస్వోపీ)ని విడుదలచేశారు.
తప్పక పాటించాల్సినవి
ప్రవేశమార్గంలో హ్యాండ్‌వాష్ లేదా శానిటైజర్ ఏర్పాటుచేయాలి.
ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలి. అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. ఒకేచోట గుమిగూడొద్దు. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
కరోనాపై అవగాహన కలిగించేలా పోస్టర్లు, ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందించాలి.
ఏసీ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
పరిసరాలను తరచూ శుభ్రపరచడం, శానిటైజ్ చేయడం, బాత్రూమ్‌లు, తరచూ తాకే ప్రదేశాలను శుభ్రంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
లిఫ్ట్‌లలో పరిమిత సంఖ్యలో అనుమతించాలి. ఎస్కలేటర్‌పై ఒక్కో మెట్టుకు ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకోవాలి.
రెస్టారెంట్లు పార్సిల్ (టేక్‌అవే) తీసుకునే విధానాన్ని ప్రోత్సహించాలి. 50 శాతం సీటింగ్ మించకుండా వినియోగదారులను అనుమతించాలి.
హోటళ్లలో వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫామ్‌లు నింపేలా చూడాలి.
షాపింగ్ మాల్‌లోకి పరిమిత సంఖ్యలో వినియోగదారులను అనుమతించాలి.
మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చేవారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి. డాక్టర్ పరిశీలించే వరకువారికి ఫేస్ కవర్ ఏర్పాటుచేయాలి. రాష్ట్ర హెల్ప్‌లైన్ లేదా జిల్లా హెల్ప్ లైన్‌కు లేదా దగ్గరలోని వైద్యకేంద్రాలకు సమాచారం అందించాలి. కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా సంస్థల నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు.
ఏపీలో అనుమతించేవి
ఏపీలో రెస్టారెంట్లలో ప్రవేశ ద్వారం వద్దే శానిటైజేషన్ చేయడం, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.
కాగా, ఏప్రిల్ 20 నుంచే ‘రీస్టార్ట్’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపింది. దీంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలయ్యాయి.
రాష్ట్రంలో 80రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి దేవాలయాలు తెరుచుకున్నాయి. ఉ.6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ, మంగళవారాల్లో టీటీడీ సిబ్బందితో, బుధవారం తిరుమలలోని స్థానికులతో ట్రయల్ రన్ మొదలు పెట్టి, గురువారం (11వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ శాఖ అధీనంలోని మిగిలిన అన్ని ఆలయాల్లోనూ సోమ, మంగళవారాల్లో ఆయా ఆలయాల సిబ్బంది, స్థానికులతో ట్రయల్ రన్ మొదలు పెట్టి, బుధవారం (10వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అన్ని ఆలయాల వద్ద వద్ద టీటీడీ, దేవదాయ శాఖ కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లుచేశాయి. దర్శన సమయంలో భక్తులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే స్పష్టంచేశాయి. ధర్మల్ స్క్రీనింగ్ అయ్యాకే భక్తులను లోపలికి అనుమతించనున్నారు. ఆలయ మండపంలో ఎప్పుడూ 30 మంది భక్తులు మించకుండా ఉంచుతూ, గంటకు 300 మందికి మాత్రమే దర్శనం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.